For Money

Business News

గేమ్‌ యాప్‌ కంపెనీపై ఈడీ దాడులు

రకరకాల ఆన్‌లైన్‌ గేమ్స్ పేరుతో అమాయకులను మోసం చేసి వేల కోట్లు కొల్లగొట్టిన కోడ్‌ పేమెంట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులు నిర్వహించింది. మూడు చోట్ల దాడులు చేసినట్లు ఈడీ వెల్లడించింది.తీన్‌ పత్తి గోల్డ్‌, గరేనా ఫ్రీ ఫైర్‌, కాల్‌ ఆఫ్‌ డ్యూటీ వంటి గేమ్స్‌ ఆడేందుకు టోకెన్లను అమ్మిన కంపెనీ.. సదరు మొత్తాన్ని విదేశాలకు తరలించింది. ఈ టోకెన్ల ద్వారా గేమ్స్‌ ఆడి లాభాలు పొందొచ్చని వినియోగదారులను ఈ కంపెనీ మోసం చేసింది. వాస్తవానికి మన దేశంలో ఉన్నది కేవలం డమ్మీ కంపెనీ అని… ఇక్కడ వసూలు చేసిన సొమ్మును సింగపూర్‌లో ఉన్న తన మాతృ సంస్థ కోడా పేమెంట్స్‌ పీటీఈ కంపెనీకి తరలించినట్లు ఈడీ వెల్లడించింది. ఇప్పటి వరకు జనం నుంచి రూ. 2850 కోట్లు వసూలు చేసి రూ. 2265 కోట్లను సింగపూర్‌కు తరలించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం బ్యాంకుల్లో రూ. 68.53 కోట్లను ఈడీ జప్తు చేసింది. తమ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న వారి ఖాతాల నుంచి భారీ మొత్తాన్ని కోడా పేమెంట్స్‌ డ్రా చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇలా డ్రా చేసే సమయంలో గేమర్స్‌ అనుమతి లేకుండానే డ్రా చేసినట్లు పేర్కొంది. గేమింగ్‌ యాప్‌లలో వాడే అనేక పదాలు పిల్లలు/యువకులకు తెలియకపోవడంతో… వచ్చిన నోటిఫికేషన్లను వారు క్లిక్‌ చేయడంతో కంపెనీ భారీ మొత్తాన్ని డ్రా చేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఈడీ పేర్కొంది.