For Money

Business News

ప్రత్యక్ష పన్ను వసూళ్లలో ఆల్‌టైం రికార్డు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి16 నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.13.63 లక్షల కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఇదే కాలానికి వసూలైన ప్రత్యక్ష పన్నుల మొత్తం రూ.9.18 లక్షల కోటలు. అంటే ఈ ఏడాది 48 శాతం పెరిగాయన్నమాట. కరోనా రాక ముందు అంటే 2019-20లో కూడా వసూలైన మొత్తం రూ.9.56 లక్షల కోట్లే. వ్యక్తిగత, కార్పొరేట్‌ ఆదాయ పన్నుతో పాటు స్థిరాస్తి పన్ను, వారసత్వ పన్ను, గిఫ్ట్‌ ట్యాక్స్‌ ఈ ప్రత్యక్ష పన్నుల పరిధిలోకి వస్తాయి. నిజానికి 2021-22కు గాను ప్రత్యక్ష పన్నుల ఆదాయం రూ.11.08 లక్షల కోట్లుగా ఉండవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తొలుత బడ్జెట్‌లో అంచనా వేశారు. తర్వాత అంచనాను రూ.12.50 లక్షల కోట్లకు పెంచారు. ఇపుడు రూ.14 లక్షల కోట్లకు చేరేలా ఉన్నాయి.