For Money

Business News

ధరల తగ్గింపే మా ప్రథమ కర్తవ్యం

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే ప్రస్తుతం ‘రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ముందున్న ప్రథమ కర్తవ్యమని గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పునరుద్ఘాటించారు. ఇలా చేయడం వల్ల వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని, వీలైనంత దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తామని ఆయన అన్నారు. ఓ ప్రముఖ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ధరల పెరుగుదల, వృద్ధిపై ప్రపంచ పరిణామాలు ప్రభావం చూపుతాయని దాస్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాగే వివిధ దేశాల్లో ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనం ప్రభావం కూడా మన ఆర్థిక వ్యవస్థపై ఉంటుందని తెలిపారు. జూన్‌ త్రైమాసికంలో వృద్ధిరేటు 16.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని తొలుత ఆర్‌బీఐ అంచనా వేసింది. అయితే వృద్ధి రేటు 13.5 శాతమే వచ్చింది. తమ అంచనాలు తప్పడంతో దీనిపై అధ్యయనం చేస్తున్నట్లు దాస్‌ తెలిపారు. వచ్చే ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాల్లో దీనిపై వివరణ ఇస్తామని పేర్కొన్నారు.