For Money

Business News

రూ. 415 ఒకరోజులో రూ. 2,70,00

మన దగ్గర షేర్లు లేకుండా కనీసం ఫ్యూచర్స్‌ కూడా లేకుండా… ఆప్షన్స్‌ ట్రేడింగ్ చేయడమంటే మన పరిభాషలో మూడు ముక్కలాట ఆడటమే. రాత్రికి రాత్రే రాజులను పేదలుగా.. పేదలను రాజుగా మార్చే డేంజరస్‌ గేమ్‌. షేర్లు దగ్గర ఉండి లేదా ఫ్యూచర్స్‌లో పొజిషన్స్‌ తీసుకుని… టెక్నికల్స్‌ బాగా తెలిసి, దురాశకు దూరంగా ఉంటూ… హెడ్జింగ్‌తో చేసేవారికి మాత్రం ఆప్షన్స్‌ ఓ అద్భుత అవకాశం. పైగా యుద్ధం వంటి అనూహ్య ఘటనలు జరిగినపుడు ఇలాంటి వారు రాత్రికి రాత్రే కోట్లు సంపాదిస్తారు. చాలా అరుదుగా కొన్ని ఘటనలు జరుగుతుంటాయి. అదేమిటంటే కరెక్ట్‌గా డెరివేటివ్స్‌ (మంత్లీ, వీక్లీ కూడా) క్లోజింగ్‌ రోజే యుద్ధం జరగడం. ఇవి రెండు కలిసి రావడంతో మార్కెట్‌ పడుతుందని భావించి చిన్న మొత్తంతో పుట్స్‌ కొన్నవారికి కాసులు వర్షం కురిసింది. ఇవాళ ముగిసిన నిఫ్టి 16200 స్ట్రయిక్‌ రేటు వద్ద పుట్స్‌ ఆప్షన్‌ ధర నిన్న రూ.4.15. లాట్ 50 షేర్లు. కనీసం రెండు లాట్లు కొనుగోలు చేసి ఉన్నా అంటే రూ. 415లు పెట్టుబడి పెట్టినవారికి ఇవాళ వచ్చిన మొత్తం లక్షరాలా రూ.2,70,000. అంటే 5,961 శాతం లాభమన్నమాట. అదే మార్కెట్‌ పెరుగుతుందనే ధీమాతో నిన్న 16,500 కాల్‌ ఆషన్స్‌ కొన్నవారు భారీగా నష్టపోయారు. నిన్న కాల్‌ ఆప్షన్‌ రూ. 1,220 కాగా ఇవాళ జీరో. అంటే నిన్న రూ. 1,22,000 పెట్టుబడి పెట్టినవారు … ఇవాళ పూర్తిగా దివాలా తీశారన్నమాట. సాధారణంగా అనుభవమున్న ఇన్వెస్టర్లు హెడ్జ్‌ చేస్తారు. అంటే నిన్న 16,200 పుట్‌తోపాటు 16,500 కాల్‌ కూడా కొంటారు. దీంతో ఒకదానిలో లాభం… మరో లాట్‌లో నష్టం వచ్చినా… పై లాట్‌లో నికరంగా రూ. 1,50,000 దాకా లాభం వచ్చేది. కాని చాలా మంది ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ కారణంగా లేదా పెట్టుబడి లేకపోవడం వలనో ఏదో ఒకలాట్‌ కొంటారు. దీంతో ఒక్కోసారి పూర్తిగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇవాళ ఇండెక్స్‌ ఆప్షన్స్‌ చేసిన వారందిరి పరిస్థితి ఇదే. పడుతుందని కొన్నవారికి పండుగ. పెరుగుతుందని ఆప్షన్స్‌ కొన్నవారు దివాలా తీశారు.