For Money

Business News

పెట్రోల్‌ ధరలపై ఆర్థికమంత్రితో ప్రధాని చర్చ?

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్ ధరలు అనూహ్యంగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌ రేట్లను పెంచడం ఆపేసింది. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్‌ ధరలు పెరుగుతున్నా.. ఆయిల్ మార్కెట్‌ కంపెనీలు భరిస్తున్నాయి. పరిశ్రమ వర్గాల కథనం మేరకు ఆయిల్ మార్కెట్‌ కంపెనీలకు లీటరు పెట్రోల్‌కు రూ.10 నష్టం వస్తోందని, ఈ భారాన్ని మోయడం కష్టమని కంపెనీలు ప్రభుత్వానికి తెలిపినట్లు సమాచారం. ఇదే అంశంపై ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఇవాళ ప్రధాని మోడీ భేటీ అవుతున్నట్లు న్యూస్‌ 18 ఛానల్ పేర్కొంది. ఎక్సైజ్‌ డ్యూటీ పెంచడంపై ఈ సమావేశంలో చర్చిస్తారని భావిస్తున్నారు. రాజకీయ వర్గాలు కూడా దీన్ని ధృవీకరిస్తున్నాయి. ధరలు పెంచి నెపాన్ని ఒపెక్‌ దేశాలపై వేయొచ్చని ఆలోచన కూడా తెలుస్తోంది. అయితే ప్రజల విశ్వసించకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భారీగా నష్టపోయే ప్రమాదముంది. ఇవన్నీ ఆలోచించిన తరవాత కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.