ఎకరా రూ. 40 లక్షలకేనా?
గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ అదానీ డిఫెన్స్ సిస్టమ్స్‌కు నగర శివార్లలోని మామిడిపల్లె వద్ద ఎకరా రూ. 40లకే కేసీఆర్ ప్రభుత్వం ఎలా కేటాయిస్తుందని కాగ్ విమర్శించింది. ఒప్పందంలోని షరతులు పాటించకున్నా భారీ రాయితీకి ఇవ్వడంపై కాగ్ తీవ్ర అభ్యంతరం లేవనెత్తింది. కాగ్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పించింది. అదానీ డిఫెన్స్ కంపెనీ ప్రతిపాదించిన ప్రాజెక్టును కొంగకలాన్‌కు మారిస్తేనే రాయితీ ధరకు భూములు కేటాయిస్తామని మంత్రివర్గ ఉపసంఘం(సీఎస్‌సీ) నిర్ణయించిన విషయాన్ని కాగ్ ప్రస్తావించింది. ఇదే విషయాన్ని కంపెనీకి తెలిపారని పేర్కొంది. అందుకు విరుద్ధంగా కొంగరకలాన్‌కు మార్చకున్నా… మామిడిపల్లె వద్ద ఎకరాకు రూ. 40లక్షల ధర ఎలా నిర్ణయించారని నిలదీసింది. అక్కడ ఎకరా మార్కెట్ ధర అప్పట్లో అంటే 2018లో రూ. 2.13 కోట్లని కాగ్ పేర్కొంది. కంపెనీకి 20 ఎకరాలు కేటాయించడం వల్ల అదాని డిఫెన్స్‌కు రూ.34.60కోట్ల లబ్ధి చేకూరిందని కాగ్ పేర్కొంది. అదానీ డిఫెన్స్, TSIIC మధ్య 2018 జూన్ నెలలో ఒప్పందం కుదరగా, సెప్టెంబర్‌లో భూ విక్రయ ఒప్పందం కుదిరిందని కాగ్ వెల్లడించింది. ఢిఫెన్స్ రంగానికి చెందిన కంపెనీ కావడం వల్ల రాయితీ ధరకు భూమి కేటాయించినట్లు 2023 అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణను కాగ్ తోసిపుచ్చింది. ప్రభుత్వ సమాధానం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ప్లాంట్ పెట్టే ప్రాంతాన్ని మార్చితేనే రాయితీ ధరకు భూమి ఇస్తామని కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా తెలిపిన విషయాన్ని ప్రస్తావించింది. అయినా మామిడిపల్లెలోనే రాయితీ ధరకు స్థలం ఎలా కేటాయిస్తారని నిలదీసింది.

