For Money

Business News

ఒక్కటైన బ్యాంకులు

జీ గ్రూప్‌ అధినేత సుభాష్‌ చంద్రకు భారీ రుణ మాఫీ కేసు ఇపుడు జాతీయ స్థాయిలో దుమారం రేపుతోంది. రూ. 22,000 కోట్ల రుణాన్ని రూ. 6.5 కోట్లతో ఎలా మాఫీ చేస్తారంటూ వస్తున్న విమర్శలతో బ్యాంకులు అప్రమత్తమయ్యాయి. NCLT జారీ చేసిన ఉత్తర్వుల్లో బ్యాంకు రుణమాఫీ ప్రతిపాదనకు అంగీకరించలేదని ఉన్నా… సుభాష్‌ చంద్రతో సంబంధం ఉన్న ఆయన కంపెనీలు, ఇండియా బుల్స్‌ అంగీకరించడంతో NCLT ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జాతీయ స్థాయిలో విమర్శలు రావడంతో ఇపుడు ప్రభుత్వ బ్యాంకులన్నీ ఒక్కటయ్యాయి. ఉదయం నుంచి ఒక్కో బ్యాంకు పత్రికా ప్రకటనలు జారీ చేస్తున్నాయి. NCLT తీర్పును తాము అప్పీలేట్‌ ట్రైబ్యూనల్‌లో సవాలు చేస్తున్నామని పేర్కొన్నాయి. ఈ కేసులో చాలా వరకు సుభాష్‌ చంద్రకు చెందిన కంపెనీలే ఉండటం విశేషం. మరోవైపు ఈ కేసు రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌ శివ నందన్‌ శర్మ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రుణం జారీ చేసినపుడు సుభాష్‌ చంద్ర నెట్‌ వర్త్‌ రూ. 40,562 కోట్లుగా పేర్కొనగా, ఇపుడు ఆయన నెట్‌వర్‌ కేవలం రూ. 32 కోట్లు మాత్రమేనని ఎలా నిర్ధారించారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుభాష్‌ చంద్రకు రుణాలు ఇచ్చిన ఆయన సొంత కంపెనీల ఖాతాలపై కూడా అనుమానాలు ఉన్నాయి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న పలు కంపెనీలు తమ యజమానికి రుణాలు ఇచ్చి…. ఇపుడు రద్దు అంగీకరించడం ఏమిటని ఫైనాన్షియల్‌ నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply