For Money

Business News

నీ సంగతి చూస్తా… అంబానీకి వార్నింగ్‌

జీ గ్రూప్‌ అధినేత సుభాష్‌ చంద్రకు సంబంధించిన రుణ మాఫీ వ్యవహారం ఇపుడు దేశ కార్పొరేట్‌ రంగాన్ని కుదిపేస్తోంది. ఈ వార్త విషయంలో పారిశ్రామికవేత్తలు రెండు గ్రూప్‌లు విడిపోయారు. మెజారిటీ పారిశ్రామిక వేత్తలు సుభాష్‌ చంద్రకు రుణమాఫీని వ్యతిరేకిస్తూ బాహాటంగా పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో జాతీయ స్థాయిలో దీనిపై చర్చ జరుగుతోంది. NCLT రుణ మాఫీ వార్త వెలువడిన వెంటనే ఇతర మీడియా సంస్థల మాదిరిగానే రిలయన్స్‌ గ్రూప్‌ మీడియా సంస్థలు సంచలన కథనాలను వెలువరించాయి. అయితే కేసులో ఏం జరిగిందనే విషయమై పలు విశ్లేషణాత్మక కథనాలు వచ్చాయి. జీ గ్రూప్‌ అధినేత విషయంలో NCLT ఆదేశాన్ని తప్పు పడుతూ సీఎన్‌బీసీ టీవీ18, సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్స్‌లో కథనాలు వెలువడ్డాయి. ఏకంగా రూ. 22 వేల కోట్ల రుణాన్ని రూ. 6.25 కోట్లకు ఎలా మాఫీ చేస్తారంటూ వార్తలు ప్రసారమయ్యాయి. ఇందులో రుణమాఫీకి మద్దతు ఇచ్చిన కంపెనీలు కూడా జీ గ్రూప్‌ సంస్థలే అన్న విషయాన్ని వెలుగులోకి తెచ్చాయి. ఈ స్థాయి రుణమాఫీని బ్యాంకులు ఎలా సమర్థిస్తాయని ప్రశ్నించాయి. దీంతో NCLT తీర్పుపై అప్పీల్‌కు వెళ్ళనున్నట్లు బ్యాంకులు ప్రకటించారు. దీంతో తీవ్ర ఆ్రగహంతో సుభాష్‌ చంద్ర ఓ వీడియో సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు. అయితే తన సొంత మీడియా ఛానల్‌లో ఆయన మరో సందేశాన్ని ప్రసారం చేశారు. రిలయన్స్‌ అంబానీని ఆయన డైరెక్ట్‌గా హెచ్చరిస్తూ… మీ సంగతి చూస్తానని అన్నారు.
మీ సంగతి చూస్తా!
తన గ్రూప్‌ ఛానల్స్‌లో ఈ మేరకు సుభాష్‌ చంద్ర ప్రసంగం వీడియోలోని కీలక అంశాలు. ‘ధీరూభాయ్‌ అంబానీ గొప్ప వ్యాపార వేత్త. ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నా. కొడుకుగా, మీరు తండ్రి నుంచి ఏమీ నేర్చుకోలేదు. అన్నీ పోయాయి. కోల్పోవడానికి నా దగ్గర ఇంకా ఏమీ లేదు. కాని నన్ను టార్గెట్‌ చేస్తున్నారు. నన్ను దెబ్బ తీయాలని ఎందుకు చూస్తున్నావు? నేను ఖాళీ అయిపోయాను. నష్టపోవడానికి నా దగ్గర ఏమీ లేదు. కాని నష్టపోవడానికి మీ వద్ద చాలా ఉంది. నాపై తప్పుడు ప్రచారం ఆపండి. లేదంటే నేను గట్టి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. దుష్ప్రచారం చేస్తున్న నీ మనుషులను ఆపండి. ముఖేష్‌ అంబానీకి ఫోన్‌ చేశా. తీయకపోతే లేఖ రాశా. 2019లో నేను స్వయంగా ముకేష్‌ అంబానిని కలిశాను. వారి వల్లే ఆ ఏడాది జనవరిలో నా కంపెనీ షేర్లు 40 శాతం పడ్డాయి. కాని రిలయన్స్‌ తప్పులను పసిగట్టలేం. ఎందుకంటే వందల కంపెనీలను ఏర్పాటు చేసి వాటిని దాస్తారు. వాటితో షేర్ల ధరలు మ్యానిపులేట్‌ చేస్తారు? వాటిని ఎలా పసిగట్టడం. జీ కంపెనీని అమ్ముతాను. కొనుక్కోండని చెప్పాను. నేను ఆయన అపుడు నాకు సలహా ఇచ్చారు. ఇంత భారీ వడ్డీతో మీరు రుణాలుకు ఎందుకు చెల్లిస్తారని కూడా ముకేష్‌ అంబానీ నాతో అన్నారు. ఆయన సలహా తరవాత నేను వచ్చేశాను. Invetco అనే కంపెనీ ద్వారా నన్ను ఇబ్బంది పెట్టేందుకు చూశారు. నాకు ఆఫర్‌ కూడా ఇచ్చారు. నా కుటుంబానికి అది మంచి ఆఫర్‌ .. కాని మైనారిటీ వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా వొద్దన్నాను. సోనీతో జీ విలీనం చేసేందుకు ప్రయత్నించాం. అదీ కుదర్లేదు. కాని నాపై దాడి చేస్తూనే ఉన్నారు. సీఎన్‌బీసీ నెట్‌వర్క్‌ చేసిన ప్రసారంతో 22 వేల కోట్ల మాఫీ అంటూ ప్రచారం జరిగిపోయింది. ఇప్పటికైనా నాపై దుష్ప్రచారాన్ని ఆపండి. మీ మనుషులకు చెప్పండి. మనోజ్‌ మోడీ లాంటి వాళ్ళు మీ కంట్రోల్‌ ఉన్నారని తెలుసు. మరి ఆయన కంట్రోల్‌లో ఉన్నారో లేదో… నేను ఏం చేయలేను. ఏమీ లేని వ్యక్తితో మీరు ఏం పోరాటం చేస్తారు. మీరు అనేక తప్పుడు పనులు చేసిన విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు” అంటూ రిలయన్స్‌ గ్రూప్‌ను హెచ్చిరంచారు.
రిలయన్స్‌ స్పందన
సుభాష్‌చంద్ర ప్రసంగం వెంటనే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తరఫున ఒక పత్రికా ప్రకటన వెలువడింది. ఎస్సెల్‌ గ్రూప్‌ అధినేత సుభాష్‌ చంద్ర చేసిన ఆరోపణలు నిరాధారమని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన ఆరోపణలను ఖండిస్తున్నామని, రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన మీడియా సంస్థలపై ఆయన చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని స్పష్టం చేసింది.ఓ వ్యక్తిని టార్గెట్‌ చేస్తూ తమ మీడియా సంస్థలు ఎపుడూ పనిచేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఇక ముందు కూడా చేయవని పేర్కొన్నారు. ఒక వ్యాపార వేత్తగా, పారిశ్రామికవేత్తగా సుభాష్‌ చంద్ర అంటే తమకు అపార గౌరవం ఉందని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని ఆ ప్రతికా ప్రకటనలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పేర్కొంది.

https://www.facebook.com/reel/3164697900381715

Leave a Reply