For Money

Business News

రూ.2 లక్షలు ఉన్నాయా? అప్లయ్‌ చేయండి!

ఈనెల 14న జొమాటొ పబ్లిక్‌ ఆఫర్‌ ఓపెన్‌ కానుంది. 16వ తేదీన ముగుస్తుంది. ఒక రూపాయి ముఖ విలువగల ఒక్కో షేర్‌ను రూ. 72-76 మధ్య ఉంచుతోంది. పబ్లిక్‌ నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఈ షేర్‌ను రూ. 76 వద్దే అలాట్‌ చేస్తారు. ఒక్కో లాట్‌లో 195 షేర్లు ఉంటాయి. సాధారణ ఇన్వెస్టర్ కనీసం 13 లాట్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంటే కనీసం 2,535 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంటే రూ. 1,92,660 కట్టాల్సి ఉంటుంది.ఇష్యూ 16న ముగుస్తే.. 22వ తేదీన షేర్ల అలాట్‌మెంట్‌ చేస్తారు. షేర్లు అలాట్‌ కాకుంటే మీ సొమ్ము 24వ తేదీకల్లా మీ ఖాతాలో పడిపోతుంది. అంటే కేవలం ఒక వారం రోజులు మీ సొమ్ము బ్లాక్‌ అవుతుంది. ఒక వేళ షేర్‌ అలాటైతే… లిస్టింగ్‌ రోజు ఆకర్షణీయ లాభం రావొచ్చు. ఎందుకంటే ఇపుడు గ్రే మార్కెట్‌లో అంటే అనధికార మార్కెట్‌లో ఈ షేర్‌ ప్రీమియం 26 శాతం నడుస్తోంది. భారీగా ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయితే … ప్రీమియం మరింత పెరగవచ్చు.
రిస్క్‌కు రెడీ…
వెంటనే లాభం తీసుకునే వారు లిస్టింగ్‌ రోజే అమ్ముకోవచ్చు. యువతలో జొమాటొకు మంచి క్రేజ్‌ ఉంది కాబట్టి… లిస్టింగ్‌ రోజున కూడా ఈ షేర్‌కు గట్టి డిమాండ్‌ ఉండొచ్చని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ రంగంలోని పబ్లిక్‌ ఇష్యూకు వస్తున్న తొలి కంపెనీ ఇదే. కాబట్టి దీని వ్యాల్యూయేషన్స్‌ మరో కంపెనీతో పోల్చలేం. ఒకవేళ ఈ షేర్‌లో అమ్మకాల ఒత్తిడి వచ్చినా 20 శాతం మించి నష్టం ఉండకపోవచ్చని అనలిస్టులు అంటున్నారు. దీర్ఘకాలానికి ఈ షేర్‌ మంచి ఫలితాలు ఇస్తుందని వీరు అంటున్నారు. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా వచ్చే మొత్తం కంపెనీ అభివృద్ధికే ఖర్చు పెట్టనున్నారు. పైగా ఇన్వెస్టర్లందరూ కంపెనీలో కొనసాగేందుకు ఇష్టపడుతున్నారు. తొలుత తన వాటాలో అధిక వాటా అమ్ముకోవడానికి ఆసక్తి చూపిన ఇన్ఫో ఎడ్జ్‌ కంపెనీ కూడా ఎక్కువ షేర్లు కంపెనీలో కొనసాగించేందుకే మొగ్గు చూపింది. సో… ఏ విధంగా చూసినా జొమాటొ దీర్ఘకాలానికి కూడా మంచి లాభాలు అందించే అవకాశముంది. వొద్దనుకునేవారు లిస్టింగ్‌ రోజే అమ్ముకోవచ్చు. కాని డిజిటల్‌ రంగం నుంచి వస్తున్న ప్రముఖ కంపెనీ కాబట్టి.. దీర్ఘకాలానికి ఉంచుకోదగ్గ షేరని అనలిస్టులు అంటున్నారు.