For Money

Business News

ఫిచ్‌ హెచ్చరికతో అదానీ షేర్ల పతనం

రేవుల నుంచి నుంచి సిమెంట్‌ తదితర రంగాల్లో విస్తరించిన అదానీ గ్రూప్‌ చివరి మెడికల్‌ నుంచి టీవీ ఛానల్స్‌ వరకు వివిధ రంగాల్లో ప్రవేశిస్తోంది. తనకు నచ్చిన పాలకుడు అధికారంలో ఉండటంతో బ్యాంకులు వేలు కాదు కదా… లక్షల కోట్లలో అప్పులు ఇస్తున్నాయి. కేంద్రం మోడీ అధికారంలోకి రాకుంటే అదానీ పరిస్థితి ఏమిటి అని పరోక్షంగా హెచ్చరించింది అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ గ్రూప్‌ యూనిట్‌ క్రెడిట్‌సైట్స్‌. ఫిచ్‌ హెచ్చరికతో నిన్న అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌టైన్‌మెంట్‌, అదానీ గ్రీన్‌, అదానీ విల్మర్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌ కంపెనీలు షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిన్న నిఫ్టి లాభాల్లో ముగిసింది.

‘అదానీ గ్రూప్‌-డీప్‌లీ ఓవర్‌లివరేజ్డ్‌’ పేరుతో క్రెడిట్‌సైట్స్‌ నిన్న రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఎడా పెడా అప్పులు చేస్తున్న అదానీ గ్రూప్‌ ఆశించిన స్థాయిలో లాభదాయకత సాధించడం కష్టం కావొచ్చని… దీనికి కారణంగా అదానీ గ్రూప్‌ విస్తరిస్తున్న రంగాల్లో గట్టి పోటీ ఉండటమేనని పేర్కొంది. దీంతో కంపెనీ లాభాల మార్జిన్‌పై తీవ్ర ఒత్తిడి ఉంటుందని హెచ్చరించింది. అధిక రాబడుల్ని ఆశించి, రుణ పెట్టుబడులతో చేపట్టిన వృద్ధి ప్రణాళికలు.. పరిస్థితులు ప్రతికూలిస్తే రుణ ఊబిలోకి దించుతాయని, ఒకట్రెండు గ్రూప్‌ కంపెనీలు దివాలా తీసే అవకాశం ఉంటుందంటూ ఫిచ్‌ గ్రూప్‌ తీవ్ర హెచ్చరికను జారీచేసింది.
సంబంధంలేని వ్యాపారాల్లోకి..
అదానీ గ్రూప్‌ చాలావరకూ తన ప్రధాన కార్యకలాపాలతో సంబంధం లేని వ్యాపారాల్లోకి లేదా కొత్తవాటిలోకి ప్రవేశిస్తోందని ఫిచ్‌ పేర్కొంది. పైగా వాటికి భారీ పెట్టుబడులు అవసరం ఉంటుందని, దీంతో ఆయా ప్రాజెక్టుల అమలుపై ఆందోళన తలెత్తుతున్నదని క్రెడిట్‌సైట్స్‌ పేర్కొంది. మెజారిటీ వాటా ప్రమోటర్లకే ఉండటంతో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ స్థాయి అంతంతమాత్రంగానే ఉందని పేర్కొంది. రాగి రిఫైనింగ్‌, పెట్రోకెమికల్స్‌, టెలికం, అల్యూమినా ఉత్పత్తి తదితరాల్లో అదానీ గ్రూప్‌నకు అనుభవం లేదని విమర్శించింది. పైగా ఈ వ్యాపారాల్లో కొద్ది ఏండ్లపాటు లాభాలు రావని, దీంతో వీటికి తీసుకున్న రుణాల్ని అదానీ గ్రూప్‌ తక్షణమే చెల్లించలేదని తెలిపింది. అందుచేత ఈ రుణాల్ని రీఫైనాన్స్‌ చేయాలంటే క్యాపిటల్‌ మార్కెట్‌ పరిస్థితులు, స్థానిక బ్యాంకింగ్‌ సంబంధాలు బాగుండాలని ఫిచ్‌ గ్రూప్‌ పేర్కొంది.
లక్షల కోట్ల అప్పు
మన స్టాక్‌ ఎక్సేంజీల్లో అదానీ గ్రూప్‌నకు ఆరు లిస్టెడ్‌ కంపెనీలున్నాయి. ఈ లిస్టెడ్‌ కంపెనీల స్థూల రుణం 2022 మార్చినాటికి రూ. 2.31 లక్షల కోట్ల మేర ఉన్నదని ఫిచ్‌ యూనిట్‌ వెల్లడించింది. వీటి వద్దనున్న నగదు నిల్వలను మినహాయిస్తే రూ.1.73 లక్షల కోట్ల వరకూ నికర రుణం ఉంది. అదానీ శరవేగంగా జరుపుతున్న విస్తరణ, అధిక రుణ స్థాయిల పట్ల తామే కాకుండా పలువురు గ్రూప్‌ ఖాతాదారులు, ఇన్వెస్టర్లలో సైతం ఆందోళన పెరుగుతోంది.