షార్ట్ సెల్లింగ్‌కు అనుమతి ఉంది
అదానీ గ్రూప్ షేర్ల షార్ట్ సెల్లింగ్ కొనసాగుతోందని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సుప్రీంకోర్టుకు తెలిపింది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల తరవాత గ్రూప్ షేర్ల ధరల్లో కదలికలపై దర్యాప్తు చేస్తున్నట్టు కూడా సెబి తెలిపింది. అదానీ గ్రూప్ షేర్ల పతనంపై దాఖలైన పిటీషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నాయకత్వంలోని బెంచ్ విచారిస్తోంది. ఈ కేసు విచారణ సందర్భంగా సెబీకి కోర్టు నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి స్పందిస్తూ సెబీ ఈ వివరాలను కోర్టుకు సమర్పించింది. హిండెన్‌బర్గ్ నివేదిక, అది వెలువడడానికి ముందువెనుకల్లో గ్రూప్ షేర్ల మార్పులను తాము దర్యాప్తు చేపట్టినట్టు సెబీ తెలిపింది. నివేదికలో ఎక్కడా అదానీ గ్రూప్ పేరును నేరుగా ప్రస్తావించకుండా ప్రస్తుతం చర్చల్లో ఉన్న గ్రూప్ అంటూ సుప్రీంకోర్టుకు వివరాలన్నీ తెలియచేసింది.