For Money

Business News

97% మంది భారతీయుల ఆదాయం తగ్గింది

కోవిడ్‌ కేసులతో షేర్‌ మార్కెట్‌ పోటీ పడుతున్నా… లాభాలన్నీ ప్రమోటర్లకే తప్ప… ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ముఖ్యంగా లక్షలాది కార్మికులు రోడ్డున పడ్డారు. ఆర్థిక గణాంకాల విషయంలో దేశంలోనే నమ్మకమైన సంస్థ అయిన సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (CMIE) కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావం గురించి సర్వే చేసింది. కోవిడ్‌కు ముందు నెలవారీ జీతాలు తీసుకునే ఉద్యోగుల సంఖ్య 8.50 కోట్లు ఉండగా, కోవిడ్‌ సమయంలో ఈ ఉద్యోగాల సంఖ్య 7.4 కోట్లకు పడిపోయినట్లు CMIE చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ మహేష్‌ వ్యాస్‌ తెలిపారు. CMIE ఇటీవల జరిపిన సర్వే వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. కోవిడ్‌ రాకముందు దేశంలో 40.35 లక్షల మందికి ఉపాధి ఉండేది. గత ఏడాది ఏప్రిల్‌లో 12.6 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. వీరిలో 9 కోట్ల మంది రోజువారీ కూలీలని మహేష్‌ వ్యాస్‌ తెలిపారు.

2021 జనవరికల్లా ఉపాధి ఉన్నవారి సంఖ్య మళ్ళీ 40 కోట్లకు చేరింది. కాని సెకండ్‌ వేవ్‌ దెబ్బ చాలా తీవ్రంగా ఉందని, ఇపుడు ఈ ఉద్యోగాల సంఖ్య 39 కోట్లకు పడిపోయిందన్నారు. అంటే కోటి ఉద్యోగాలు పోయాయన్నమాట. చాలా మందికి తమ పాత ఉద్యోగాలు రాలేదని, ఒకవేళ అదే ఉద్యోగం దొరికినా… అదే క్వాలిటీ జాబ్‌ కాదని వ్యాస్‌ వెల్లడించారు. నెలవారీ జీతాలు పొందే ఉద్యోగాల సంఖ్య ఇంకా తగ్గుతోందని ఆయన చెప్పారు. పరిస్థితి చాలా దారుణంగా మారుతోందన్నారు.
అందరి ఆదాయం తగ్గింది
ఏడాది క్రితం ఉన్న ఆదాయంతో పోలిస్తే 97 శాతం మంది ప్రజల ఆదాయం తగ్గిందన్నారు. ఆదాయం అదే స్థాయిలో ఉన్నా… ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే గత ఏడాదితో పోలిస్తే వీరి ఆదాయం తగ్గినట్లేనని CMIE పేర్కొంది. గత ఏడాది మాదిరే… ఈ ఏడాది కూడా తమకు ఆదాయం ఉందని, మరింత మెరుగ్గా ఉందని చెప్పిన వారి సంఖ్య కేవలం 3 శాతం మంది మాత్రమేనని సర్వేలో తేలిందని మహేష్‌ వ్యాస్‌ తెలిపారు. ఏడాది క్రితం ఆదాయంతో పోలిస్తే పరిస్థితి దారుణంగా మారిందని చెప్పినవారి సంఖ్య 55 శాతమని చెప్పారు. గత ఏడాది స్థాయిలోనే ఉందని మిగిలినవారు చెప్పారన్నారు. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే వీరి ఆదాయం విలువ తగ్గినట్లే. ఇపుడు అందరి ముందు ఉన్న అతి పెద్ద ప్రశ్న.. వీరు ఎలా కోలుకుంటారనేదని మహేష్‌ వ్యాస్‌ తెలిపారు.
మే 23తో ముగిసిన వారంలో నిరుద్యోగ స్థాయి 14.73 శాతానికి చేరిందని CMIE పేర్కొంది. పట్టణాల్లో నిరుద్యోగం 17 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 14 శాతం ఉందన్నారు. నిరుద్యోగ రేటు గత ఏప్రిల్‌లో 8 శాతం చొప్పున పెరిగిందని CMIE తెలిపింది. మార్చిలో ఈ రేటు 6.5 శాతం ఉండేది.