For Money

Business News

5.83 కోట్ల ఐటీ రిటర్న్‌లు దాఖలు

గత 2021-22 ఆర్థిక సంవత్సరానికి 5.83 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ఐటీఆర్‌లు) దాఖలయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం (2020-21)కూడా వచ్చిన ఐటీఆర్‌ల సంఖ్య దాదాపు ఇంతే ఉండటం విశేషం. 2020-21 సంవత్సరానికి పొడిగించిన గడువుతేదీ 2021 డిసెంబర్‌ 31కాగా, ఆ తేదీనాటికి 5.89 కోట్ల రిటర్న్‌లు దాఖలయ్యాయి. ఈ ఏడాది మాత్రం జూలై 31కే గడువు ముగిసింది. చివరి రోజున భారీగా 72 లక్షల ఐటీఆర్‌లు వచ్చాయి. రిటర్న్‌లు దాఖలు చేసినవారిలో ఖాతాల ఆడిటింగ్‌ అవసరం లేని ఉద్యోగులు, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు అత్యధికంగా ఉన్నారు. తాజా నిబంధనల ప్రకారం 2022-23 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి (2021-22 ఆర్థిక సంవత్సరం) రూ. 5 లక్షలు పైబడిన వార్షికాదాయం ఉన్నవారు గడువు దాటాక రిటర్న్‌ దాఖలు చేస్తే రూ. 5,000 ఆలస్య రుసుం చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ఆదాయపు పన్ను రిటర్న్‌ల ఈ-వెరిఫికేషన్‌కు గడువు తగ్గించారు. ఇపుడు గడువు 120 రోజులు కాగా, దీన్ని 30 రోజులకు తగ్గించినట్టు ఐటీ శాఖ తెలిపింది. ఆగస్టు 1 నుంచి ఈ తగ్గింపు అమలులోకి వచ్చింది.