For Money

Business News

అక్షయ తృతియ: ఈసారీ నిరాశే

ఈనెల 14వ తేదీన అక్షయ తృతీయ. గత ఏడాది సరిగ్గా లాక్‌డౌన్‌ సమయంలో ఈ పండుగ వచ్చింది. ఈసారి కూడా వివిధ రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ లేదా కఠిన ఆంక్షలు ఉన్నాయి. అంతర్జాతీయ మర్కెట్‌లో 1700 డాలర్ల ప్రాంతానికి వెళ్ళిన బంగారానికి దిగువ స్థాయిలో మద్దతు అండంతో ఇపుడు 1833 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ సమయంలో.. పైగా ఈ ధర వద్ద బంగారం కొనుగోలు చేయడానికి ప్రజలు ఇష్టపడకపోవచ్చని బులియన్‌ వర్తకులు భావిస్తున్నారు. అయితే పండుగ రోజు కొనుగోలు చేయాలనుకునేవారికి జువలరీ షాపులు డోర్‌ డెలివరీ కింద బంగారాన్ని విక్రయిస్తున్నాయి. మరికొందరు డిజిటల్‌ మార్కెటింగ్‌ అంటే ఆన్‌లైన్‌లో అమ్మకాలు చేస్తున్నారు. ఈసారి పెళ్ళిళ్ళ సీజన్‌ ఉన్నందున కొన్ని ఆర్డర్లు వస్తున్నాయని మరికొందరు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. పలు కారణాల వల్ల ఏడాది నుంచి వాయిదా పడిన పెళ్ళిళ్ళు ఈసారి భారీ ఎత్తున జరుగనున్నాయని… అమ్మకాలు పెరిగాయని మలబార్‌ గోల్డ్‌ అంటోంది. ప్రజలకు ఇపుడు బంగారం కొనుగోలు చేయాలని ఉన్నా… కరోనా కారణంగా షాపింగ్‌కు భయపడుతున్నారని ఆ కంపెనీ అంటోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు బాగా తగ్గే అవకాశముందని, ముఖ్యంగా చిన్న షాపుల యజమానులు దారుణంగా దెబ్బతింటారని బులియన్‌ వర్గాలు అంటున్నాయి. అక్షయ తృతియ కారణంగా చిన్న వ్యాపారస్థులకు పెద్ద ప్రయోజనం లేదన్నారు. రానున్న నెల లేదా రెండు నెలల్లో ఔన్స్‌ బంగారం ధర 1920 డాలర్లకు చేరుతుందని బులియన్‌ ట్రేడింగ్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.