For Money

Business News

పెరిగిన ప్రతిసారీ పడుతూ…

ఆరంభం నుంచి చివరి వరకు పెరిగిన ప్రతిసారీ నిఫ్టిలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఆరంభంలో తాకిన 16484 పాయింట్ల స్థాయి ఇవాళ్టి గరిష్ఠ స్థాయికిగా నిలిచింది. ఈ స్థాయి తరవాత నిఫ్టి ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 16340ని తాకింది. అక్కడి నుంచి దాదాపు అర డజనుసార్లు నిప్టి ఒక మోస్తరుగా కోలుకున్నా… ఇన్వెస్టర్లు అమ్మడానికి ఛాన్స్‌గా భావించారు. చివరి అరగంటలో నిఫ్టి స్వల్పంగా పెరిగినా.. చివరి క్షణాల్లో కూడా లాభాల స్వీకరణ జరిగింది. నిఫ్టి 16411 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 271 పాయింట్లు నష్టపోయింది. కొన్ని ప్రధాన షేర్లకు మద్దతు లభించినా… అనేక బ్లూచిప్‌ కంపెనీలు భారీగా పతనమయ్యాయి. ముఖ్యంగా బజాజ్‌ ఫైనాన్స్‌, దివీస్‌ ల్యాబ్‌, శ్రీ సిమెంట్‌ వంటి షేర్లు కూడా అయిదు శాతం వరకు నష్టపోయాయి. ముఖ్యంగా దివీస్‌ వంటి షేర్లలో వస్తున్న అమ్మకాల ఒత్తిడి చూస్తుంటే… నిఫ్టి మరింత బలహీనపడే అవకాశముంది. యాక్సిస్‌ బ్యాంక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కు సంబంధించిన ఓ వార్త రావడంతో యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్‌ 4 శాతంపైగా నష్టపోయింది. ఉదయం నష్టాల్లో ఉన్న జొమాటొ వంటి కొన్ని షేర్లకు దిగువ స్థాయిలో మద్దతు అందింది. అదానీ పవర్‌ కూడా 5 శాతం లాభంతో ముగిసింది. అలాగే ఎస్‌బీఐ కూడా నష్టాల నుంచి గ్రీన్‌లోకి వచ్చింది. నిఫ్టి 1.6 శాతం నష్టపోగా, ఇతర సూచీలు దాదాపు రెండు శాతం పైగా నష్టపోయాయి.