For Money

Business News

ఈడీపై షామీ తీవ్ర ఆరోపణలు

చెప్పినట్లు చేయకపోతే భౌతిక దాడులు తప్పవని, అరెస్ట్‌ చేసి… మీ కెరీర్‌ను కూడా నాశనం చేస్తామని తమ కంపెనీ ఉన్నతాధికారులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు బెదిరించారని షామీ ఆరోపించింది.కంపెనీ అధికారుల కుటుంబ సభ్యులను, బంధువులను కూడా ఈ కేసులో ఇరికిస్తామని బెదిరించారని కర్ణాటక హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. షామీ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మను జైన్‌ నాలుగు సార్లు ఈడీ ఎదుట హాజరై… వారు కోరిన సమాచారం ఇచ్చారని, ఆయన బంధువుల, కుటుంబ సభ్యుల డేటాను కూడా ఈడీ అధికారులు డిమాండ్‌ చేశారని… వాటిని కూడా మను జైన్‌ ఇచ్చారని షమీ పేర్కొంది. షామికి చెందిన రూ.5551.27 కోట్ల ఆస్తుల జప్తు చేస్తూ ఈడీ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ షామీ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. వెకేషన్‌ బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ హేమంత్‌ చందన్‌గౌడర్‌ వాదనలు విన్నాక… ఈడీ ఆదేశాలపై స్టే విధించడంతో పాటు ప్రతివాదులు సహా కేంద్ర ఆర్థిక శాఖ, ఈడీలోని పలువురు అధికారులకు నోటీసులు జారీచేశారు. ఈనెల 12కు కేసు విచారణ వాయిదా వేశారు. ఈ సందర్భంగా షామి దాఖలు చేసిన పిటీషన్‌లో అనేక సంచలన అంశాలను కోర్టు దృష్టికి తెచ్చింది. కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ సమీర్‌ బీఎస్‌ రావును కూడా ఈడీ అధికారులు బెదిరించి స్టేట్‌మెంట్లు తీసుకున్నారని కంపెనీ పేర్కొంది. ఇక నుంచి విదేశాలకు తమ కంపెనీ ఎలాంటి రాయల్టీలు పంపదని రాతపూర్వకంగా ఏప్రిల్‌ 14 ఈడీ అధికారులు రావు దగ్గర నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్నారని షమీ ఆరోపించింది. తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్న విధంగా నిర్ణయాలు తీసుకునే లేదా స్టేట్‌మెంట్లు ఇచ్చే అధికారం తనకు లేదని, కాబట్టి తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటానని ఏప్రిల్‌ 25న బీఎస్‌ రావు ఈడీ అధికారులు లేఖ రాశారని, అయితే అలా స్టేట్‌మెంట్‌ వెనక్కి తీసుకోవడానికి ఈడీ అధికారులు అంగీకరించలేదని షమీ ఆరోపించింది.