For Money

Business News

మా దగ్గర పనిచేస్తూ… మరో ఉద్యోగమా?

మూన్‌లైటింగ్‌కు పాల్పడిన ఉద్యోగులపై ప్రముఖ టెక్నాలజీ సంస్థ విప్రో ఘాటుగా స్పందించింది. ఒక కంపెనీలో పనిచేస్తూ మరో కంపెనీకి పనిచేయడాన్ని మూన్‌లైటింగ్‌ అంటారు. పలు ఐటీ కంపెనీలు ఈ పద్ధతిని అనుమతిస్తుండగా… విప్రో మాత్రం ససేమిరా అంటోంది. ఒకే సమయంలో రెండు సంస్థల్లో పనిచేసిన 300 మంది సిబ్బందిని గుర్తించి, వారిని తమ ఉద్యోగం నుంచి తొలగించినట్లు విప్రో చైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ తెలిపారు. ఇలా తమ కంపెనీలో పనిచేస్తూ పోటీ సంస్థల్లోనూ విధులు నిర్వహిస్తున్నవారిని ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. మూన్‌లైటింగ్‌ ఉద్యోగులను తొలగించిన మాట నిజమేనని ఢిల్లీలో జరుగుతున్న ఏఐఎంఏ సదస్సులో రిషద్‌ మాట్లాడుతూ వెల్లడించారు. మూన్‌లైటింగ్‌ వ్యవహారం ఇపుడు ఐటీ పరిశ్రమను వేధిస్తోంది. గతంలో ఉద్యోగులు ఆఫీసు నుంచి పనిచేస్తుండటంతో ఈ సమస్య తక్కువగా ఉండేదని.. ఇపుడు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అమల్లో ఉండటంతో కొంత మంది ఉద్యోగులు ఇతర ఐటీ సంస్థలకు కూడా పనిచేస్తున్నట్లు ఐటీ కంపెనీలు గుర్తించాయి. మొత్తానికి ఈ వ్యవహారం ఇపుడు ఐటీ పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారింది.