For Money

Business News

వడ్డీ రేట్లు పెంచిన అమెరికా ఫెడ్‌

ఊహించినట్లే అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ 0.75 శాతం మేర వడ్డీ రేట్లను పెంచింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వరుసగా మూడోసారి ఫెడ్‌ వడ్డీ రేట్లను పెంచింది. అమెరికా ద్రవ్యోల్బణం గత 40 ఏళ్లలో గరిష్ట స్థాయికి చేరడంతో ఫెడ్‌ వడ్డీ రేట్లను భారీగా పెంచుతోంది. తాజా పెంపుతో వడ్డీ రేటు 3.0 నుంచి 3.25కి పెరిగాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అమెరికా చాలా కాలం అధిక వడ్డీ రేట్లను భరించాల్సి ఉంటుందని ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ అన్నారు. ఈ ఏడాది చివరికల్లా వడ్డీ రేట్లను 4.4 శాతానికి ఫెడ్‌ పెంచే అవకాశముంది. ఇప్పటి వరకు ఈ రేట్లను 3.8 శాతం వరకు పెంచుతారని అంచనా. దాదాపు 0.6 శాతం అధికంగా పెంచనుందన్నమాట. అయితే జోరోమ్‌ వ్యాఖ్యలు మార్కెట్లలో ఆందోళన పెంచుతున్నాయి. అధిక వడ్డీ రేట్లు రెండు లేదా మూడు త్రైమాసికాలు ఉంటుందని ఇప్పటి వరకు మార్కెట్‌ అనలిస్టులు అంచనా వేశారు. అయితే పావెల్‌ మాత్రం అధిక వడ్డీ రేట్లు చాలా కాలం ఉంటుందని చెప్పడంతో ఈక్విటీ మార్కెట్లలో ఒత్తిడి పెరగవచ్చు.