For Money

Business News

క్యాపిటల్‌ మార్కెట్‌కు వాప్‌కోస్‌

ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘వాట‌ర్ అండ్ ప‌వ‌ర్ క‌న్సల్టెన్సీ స‌ర్వీసెస్ లిమిటెడ్ (WAPCOS)’ క్యాపిటల్‌ మార్కెట్‌లో ప్రవేశించనుంది. పబ్లిక్‌ ఆఫర్‌ కోసం ప్రాస్పెక్టస్‌ను సెబీ ఇద్ద దాఖలు చేసింది. సంస్థలో 25 శాతం వాటాకు సమానమైన 3.25 కోట్ల ప్రభుత్వ ఈక్విటీ ఈ పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా విక్రయిస్తారు. షేర్‌ ముఖ విలువ రూ.10. పబ్లిక్‌ ఆఫర్‌లో 35 శాతం షేర్లను రీటైల్‌ వాటాదారులకు విక్రయిస్తారు. పబ్లిక్‌ ఆఫర్‌ సగం క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ కొనుగోలుదారులకు, 15 శాతం సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు కేటాయిస్తారు. వాప్‌కోస్‌ కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో పనిచేస్తోంది. నీటి వనరులు, విద్యుత్తు సహా ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో కన్సల్టెన్సీ, ఇంజినీరింగ్‌, నిర్మాణం వంటి సేవల్ని అందిస్తోంది. దాదాపు 30 దేశాల్లో ఈ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ.2,798 కోట్ల ఆదాయంపై రూ.69.16 కోట్ల నికర లాభం ఆర్జించింది. మార్చి 2022 నాటికి కంపెనీ ఆర్డర్‌ బుక్‌ విలువ రూ.2,533.93 కోట్లు కాగా.. నిర్మాణ ఒప్పందాల విలువ రూ.18,497.33 కోట్లని కంపెనీ పేర్కొంది.