For Money

Business News

రూ. 1500 కోట్లు ముంచిన టీటీడీ బోర్డు సభ్యుడు

హైదరాబాద్‌ శివారులోని అమీన్‌పూర్‌లో ఫ్లాట్ల పేరుతో మాయమాటలు చెప్పి రూ. 1,500 కోట్లు కొల్లగొట్టారని… సాహితీ శ్రావణి ఎలైట్ బాధిత సంఘం అంటోంది. తమ సొమ్ము వెనక్కి ఇవ్వాలని ఎన్నిసార్లు మొత్తుకున్నా… వాయిదాలు వేయడం తప్ప.. తమకు సొమ్ము వెనక్కి ఇవ్వడం లేదని హైదరాబాద్‌ నాంపల్లిలోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సి.సి.ఎస్)లో ఫిర్యాదు చేశారు. అమీన్‌పూర్‌లో ఫ్లాట్ల పేరుతో సుమారు రూ. 1,500 కోట్లు కొల్లగొట్టారంటూ సంస్థ యజమాని, టీటీడీ బోర్డు సభ్యుడు బూదాటి లక్ష్మీ నారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీ ప్రభుత్వం నియమించిన జంబో బోర్డులో ఈయన కూడా సభ్యుడు. ఎన్నో ఏళ్లు శ్రమించి దాచుకున్న సొమ్మును చెల్లిస్తే మోసం చేశారని వీరు ఆగ్రహం వ్యక్తం చేశారు. భాదితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సి.సి.ఎస్. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
భూమిపైనే అనుమానం
మూడేళ్ళ క్రితం గజం రూ. 2000 నుంచి రూ. 2800 వరకు చెల్లించి ఫ్లాట్లు బుక్‌ చేసుకున్నారు చాలా మంది. సంవత్సరాలు గడుస్తున్నా… ప్రాజెక్టులో కదలిక లేకపోవడంతో చాలా మంది తమ సొమ్ము వెనక్కి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. యాజమాన్యం వాయిదాలు వేస్తోందే గాని.. తమ డబ్బులు వెనక్కి ఇవ్వడం లేదని ఫ్లాట్లు కొన్నవారు ఆరోపిస్తున్నారు. దాదాపు 23 ఎకరాల విస్తీర్ణంలో ఈ టవర్స్‌ నిర్మించదలిచారు. కాని అసలు ఈ భూమి యజమాని కంపెనీ పేరుతో ఉందా లేదా అన్న అనుమానం కల్గుతోందని ఫ్లాట్ల యజమానులు అంటున్నారు. దాదాపు 1300 నుంచి 1500 మంది ఈ టవర్స్‌లో ప్లాట్లు బుక్‌ చేసుకున్నారు. కొంత మందికి చెక్కులు ఇచ్చినా అవి బౌన్స్‌ కావడంతో కొనుగోలు దారుల్లో ఆందోళన అధికమైంది. మూడేళ్ళయినా ఈ ప్రాజెక్టు ఎపుడు పూర్తవుతుందో తెలియడం లేదని అంటున్నారు.ఇప్పటికే ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉండగా, ఎపుడు పూర్తవుతుందో తెలియడం లేదని వీరు అంటున్నారు.
ఎవరిదీ ఈ కంపెనీ?
సాహితీ శ్రావణి ఎలైట్‌ పేరుతో ఈ ప్రాజెక్టును సాహితి ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్మిస్తోంది. ఈ కంపెనీలో డైరెక్టర్లుగా లక్ష్మీ నారాయణతో పాటు గోలమరి అశోక రెడ్డి, ఆంథోని రెడ్డి గోలమరి, శశాంక్‌ సాగర్‌ సిద్దం, తాయి ప్రహ్లాద్‌, పార్వతి బూదాటి, శాత్విక్‌ బూదాటి డైరెక్టర్లుగా ఉన్నారు.లక్ష్మీ నారాయణకు డజనుకు పైగా కంపెనీలు ఉండగా… కొన్ని కంపెనీలలో ఈయనతో పాటు ఆంథోని రెడ్డి కామన్‌ డైరెక్టర్లుగా ఉన్నారు. శాత్విక్‌ బూదాటి ‘తెలుగు టైమ్స్‌’ పేరుతో ఈ- పేపర్‌ తేవడంతో పాటు వెబ్‌సైట్లు నిర్వహించే తెలుగు టైమ్స్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్నారు. మరి ఈ ప్రాజెక్టు కింద కస్టమర్ల నుంచి వసూలు చేసిన సొమ్ము ఇతర కంపెనీలకు మళ్ళించారా లేదా అన్నది పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.