For Money

Business News

మళ్ళీ అమ్మకానికి కేర్‌ హాస్పిటల్స్‌!

హైదరాబాద్‌కు చెందిన కేర్స్ హాస్పిటల్స్ చేతులు మారనుంది. దాదాపు మూడేళ్ల కింద కేర్ హాస్పిటల్స్ పగ్గాలను ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అబ్రాజ్ నుంచి ఎవర్‌కేర్‌ కొనుగోలు చేసింది. హాస్పిటల్‌ను అమ్మిపెట్టి పనిని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌లైన బార్‌క్లేస్‌, బోత్‌షీల్డ్‌లకు కంపెనీ అప్పగించింది.. కేర్ హాస్పిటల్స్ విక్రయానికి సలహాదారుల నియామకం నిజమేనని , అయితే లావాదేవీ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని తెలుస్తోంది. ఈ హాస్పిటల్‌ ఈక్విటీలో ‘ఎవర్‌కేర్‌’కు 72 శాతం వాటా ఉంది. మొత్తం వాటాను అమ్మకానికి పెట్టినట్టు సమాచారం. అమెరికా పీఈ సంస్థ టీపీజీ మద్దతు ఉన్న ఎవర్‌కేర్‌ గ్రూప్‌ 2019లో ‘అబ్రాజ్‌ క్యాపిటల్‌’ అనే పీఈ సంస్థ నుంచి ఈ వాటా కొనుగోలు చేసింది. అంతకుముందు 2016లో కేర్‌ హాస్పిటల్స్‌ను రూ.2,000 కోట్లకు అడ్వెంట్‌ క్యాపిటల్‌ నుంచి అబ్రాజ్‌ చేజిక్కించుకుంది. తరవాత అబ్రాజ్‌ ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుపోయి.. దివాలా తీసింది. ఎవర్‌కేర్‌ చేతికి వచ్చాక కేర్‌ హాస్పిటల్స్‌ను పూర్తిగా పునర్‌ వ్యవస్థీకరించింది. కొవిడ్‌ నేపథ్యంలో వైద్య ఆరోగ్య సేవలకు ఇటీవల మంచి డిమాండ్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేర్‌ హాస్పిటల్‌ నుంచి తప్పుకునేందుకు ఇదే సరైన సమయమని ఎవర్‌కేర్‌ భావిస్తున్నట్టు సమాచారం. దక్షిణ భారత్‌లో తమ హాస్పిటల్స్‌ నెట్‌వర్క్‌ను విస్తరించానుకునే సంస్థలు లేదా భారత ఆరోగ్య, వైద్య సేవల రంగంలో పెట్టుబడుల కోసం చూస్తున్న పీఈ సంస్థలు కేర్‌ హాస్పిటల్‌ ఈక్విటీలో మెజారిటీ వాటా కోసం పోటీ పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఐదు రాష్ట్రాల్లో 12 హాస్పిటల్స్‌, దాదాపు 2,000 పడకల నెట్‌వర్క్‌ ఉన్న కేర్‌ హాస్పిటల్‌లో మెజారిటీ వాటా కోసం ఈ సంస్థలు పెద్ద మొత్తంలోనే ఆఫర్‌ చేస్తాయని భావిస్తున్నారు. డాక్టర్‌ రామరాజు ఇతరలు ఈ హాస్పిటల్స్‌ను 1997లో నెలకొల్పిన విషయం తెలిసిందే. తరవాత అడ్వెంట్‌ క్యాపిటల్‌కు 72 శాతం వాటా విక్రయించారు. అడ్వెంట్‌ నుంచి అబ్రాజ్‌ చేతికి, తరవాత ఎవర్‌కేర్‌ చేతికి వచ్చిన కేర్‌ హాస్పిటల్స్‌ మళ్ళీ అమ్మకానికి సిద్ధమైంది. హైదరాబాద్‌ కేంద్రం అనేక హాస్పిటల్స్‌ ఇటీవల చేతులు మారాయి.