For Money

Business News

మంచి రోజులు వచ్చినట్లేనా?

రెండు కరోనా వేవ్‌లను తట్టుకుని… రియల్‌ ఎస్టేట్‌ రంగం నిలబడింది. ముఖ్యంగా రెండో వేవ్‌లోనే రియల్‌ ఎస్టేట్‌ కోలుకోవడం ప్రారంభమైంది. చాలా వరకు ప్రధాన కంపెనీల షేర్లు 50 శాతం నుంచి 60 శాతంపైగా పెరిగాయి. కాని పరిశ్రమ కోలుకుంటున్న క్రమంలో అనేక చిన్న కంపెనీలు కనుమరుగు అయిపోయింది. అనిశ్చితిని తట్టుకోలేకపోయాయి. నగదు బ్యాలెన్స్‌ ఉన్న పెద్ద కంపెనీలు ఈ షాక్‌ను తట్టుకున్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే రియల్‌ ఎస్టేట్‌ డైనమిక్స్‌ మారిపోయాయి. రెసిడెన్షియల్ ఇళ్లకు ఇది వరకు ఉన్న నిర్వహచనం మారిపోయింది. ఇపుడు చాలా మంది విశాలమైన ఇళ్ళు కోరుకుంటున్నారు. అలాగే కమర్షియల్‌ స్పేస్‌ కూడా కొత్త రూపు సంతరించుకుంటోంది. పాత ప్రాజెక్టులకు అనుకూలంగా చేసిన నిర్మాణాలను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా కంపెనీలు దీనికి బదలు కొత్త ప్రాజెక్టుల్లో స్పేస్‌ కొనుగోలు చేయడం లేదా లీజు తీసుకోవడం ప్రారంభమైంది. ఇదో కొత్త ధోరణి మార్కెట్‌లో. సరే… మారిన డిమాండ్‌లు, కొత్త రకం వినియోగదారులు, కొత్త టేస్ట్‌తో భవన నిర్మాణం…ఇలా సంప్రదాయ రియల్‌ఎస్టేట్‌కు భిన్నంగా ఓ కొత్త రియల్ ఎస్టేట్‌ రంగం రూపుదిద్దుకుంటున్న సమయంలో రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం రియల్‌ ఎస్టేట్‌కు మరో పరీక్ష పెట్టింది. ముఖ్యంగా ముడిపదార్థాల ధరలు భారీగా పెరగడంతో ఇపుడు మధ్య తరహా కంపెనీలు కూడా పునరాలోచనలో పడ్డాయి. పరిశ్రమలో వృద్ధి రేటు గురించి కాస్త ప్రోత్సాహకర డేటా వస్తున్నా… ద్రవ్యోల్బణం లెక్కలోకి తీసుకుంటే… పరిస్థితి ముందుకు సాగుతున్నట్లేనా అన్న అనుమానం కల్గుతోంది. రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి కూడా ఇపుడు కొన్ని మార్కెట్లకే పరిమితం అవుతోంది. చిన్న, మధ్య తరహా పట్టణాల్లోకి రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు విస్తరిస్తున్నా… మార్జిన్స్‌పై ఒత్తిడి పెరుగుతోంది. అయినా పలు కంపెనీలు కొత్త ప్రాజెక్టులతో ముందుకు వస్తున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు కూడా భారత్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెంచుతున్నారు. సరిగ్గా ఈ సమయంలో మళ్ళీ వడ్డీ రేట్లు పెరుగుతాయన్న భయం మార్కెట్‌లో కన్పిస్తోంది. హౌసింగ్‌ రంగానికి ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు వెంటనే పెద్దగా పెరగకపోయినా… గృహ నిర్మాణ సామగ్రి ధరలు భయపెడుతున్నాయి. రూ. 50 లక్షల లోపు ఉన్న గృహాలకు డిమాండ్‌ ఒక మోస్తరుగా ఉన్నా కోటి దాటిన గృహాలకు డిమాండ్‌ అంతంత మాత్రమే ఉంటోంది. మరి వడ్డీ రేట్లు పెరిగితే … ఈ డిమాండ్‌ ఉంటుందా అన్న అనుమానం వ్యక్తమౌతోంది. ఇలాంటి సమయంలో ఫ్లాట్లు కొనుగోలు చేసేవారు కూడా క్యాష్‌ రిజర్వ్‌లు ఉన్న కంపెనీల వద్ద ఫ్లాట్లు తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. వడ్డీ భారం లేని కంపెనీలు ఈ రిస్క్‌ను బాగా ఎదుర్కొంటాయని వీరి అంచనా. అలాగే క్యాష్‌ నిల్వలు బాగా ఉన్న కంపెనీల షేర్లనే కొనాలని స్టాక్‌ మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. మార్కెట్లు నిస్తేజంగా మారితే… రియల్‌ ఎస్టేట్‌ కూడా డల్‌ అవుతుంది. కాని పరిస్థితి ఏమాత్రం మెరుగుపడినా.. కోలుకోవడంలో ఇతర పరిశ్రమల కన్నా రియల్‌ ఎస్టేట్‌ ముందుంటుంది.