ఇన్వెస్టర్లకు చుక్కులు చూపిన ఆర్బీఐ
నెల రోజుల క్రితం సూపర్ అంతా బాగుందన్న ఆర్బీఐకి అకస్మాతుగా జ్ఞానోదయమైంది. ఉదయం చెప్పి మధ్యాహ్న ప్రకటన చేసింది. నెలరోజుల్లో కొంపలు అంటుకున్నాయంటూ ఏకంగా 0.4 శాతం మేరకు రెపో రేటును పెంచింది. జూన్ నెలలో పావు శాతం రేటు పెంచుతారనే అంచనాతో ఉన్న స్టాక్ మార్కెట్… ఆర్బీఐ షాక్‌కు కంగుతింది. ఏకంగా గరిష్ఠ స్థాయి 500 పాయింట్లకు పైగా పడింది. చివరల్లో కాస్త కోలుకుని 391 పాయింట్ల నష్టంతో 16677 పాయింట్ల వద్ద ముగిసింది. ఇప్పటి వరకు నిఫ్టికి ఉన్న అన్ని రకాల సపోర్ట్ ట్రెండ్ లైన్స్ పోయాయి. నిఫ్టిలో ఏకంగా 45 షేర్లు నష్టాల్లో క్లోజ్ కాగా, కేవలం అయిదు షేర్లు లాభపడ్డాయి. అందులో బ్రిటాని, కొటక్ మినహా మిగిలిన మూడు ప్రభుత్వ రంగ కంపెనీలు. ఉదయం నుంచి లాభాల్లో ఉన్న నిఫ్టి బ్యాంక్, నిఫ్టి ఫైనాన్షియల్ సూచీలు ఏకంగా రెండున్నర శాతం నష్టంతో ముగిశాయి. ఇక అన్నింటికన్నా అధికంగా నిఫ్టి నెక్ట్స్ పతనమైంది.ఈ సూచీ దాదాపు మూడు శాతం పతనం కాగా, మిడ్‌క్యాప్ నిఫ్టి కూడా 2.53 శాతం నష్టంతో ముగిసింది. బ్యాంక్ నిఫ్టిలో కొటక్ బ్యాంక్ ఒక్కటే 0.03 శాతం లాభంతో ముగిసింది. మిగిలిన అన్ని బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అనుకోకుండా వచ్చిన బాంబుతో… మార్కెట్లో లాంగ్‌లో ఉన్న ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. వెరిశి ఆర్బీఐ నిర్ణయం స్టాక్ మార్కెట్‌కు ఇవాళ పీడకలగా మారింది.