For Money

Business News

హైదరాబాద్‌లో థైరోనార్మ్‌ నకిలీ మందులు

ఇటీవలి కాలంలో థైరాయిడ్‌ సంబంధిత ఔషధం ‘థైరోనార్మ్‌’ బ్రాండ్‌ను చాలా మంది వాడుతుంటారు. అయితే ఈ బ్రాండ్‌కు నకిలీ మందులు మార్కెట్‌లో చాలా ఉన్నట్లు తెలంగాణ డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ గుర్తించింది. ఈ మందు తయారు చేసే అబాట్ లేబొరేటరీస్‌ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా మార్కెట్‌లో అదే బ్రాండ్‌తో చాలా నకిలీ మందులు ఉన్నాయని, అవి కంపెనీ తయారు చేసే మందు స్థాయిలో నాణ్యత లేని విషయాన్ని అధికారులు గుర్తించారు. ఇతర బహుళజాతి కంపెనీలు, దేశీయ ప్రధాన కంపెనీల నుంచి కూడా ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయని డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన అధికారులు మనీకంట్రోల్ వెబ్‌సైట్‌కు తెలిపారు. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తారఖండ్‌, పాండిచ్చేరిలలో అనేక ప్రధాన ఔషధాలను కాంట్రాక్ట్‌ పద్ధతిలో తయారు చేస్తున్నాయి. ఇవే బ్రాండ్‌ లేబుల్స్‌తో నకిలీ మందులు మార్కెట్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో చాలా మందులు కర్ణాటకలో తయారు అవుతున్నాయని, వాటిని హైదరాబాద్‌కు తరలిస్తున్నారని అన్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు రెండుసార్లు దాడులు నిర్వహించగా అబాట్‌ లేబొరరేటరీస్‌ తయారు చేసే థైరాక్సిన్‌ సోడియం ట్యాబ్లెట్లు (థైరోనార్మ్‌) భిన్న బ్యాచ్‌ నంబర్లలో ఉన్నట్లు తేలిందని డీసీఏ అధికారులు తెలిపారు. థైరాక్సిన్‌ సోడియం ట్యాబ్లెట్లను దాదాపు 30 కంపెనీలు తయారు చేస్తున్నాయి. అయితే అబాట్‌ తయారు చేసే థైరోనార్మ్‌ వాటా 50 శాతంపైగా ఉంది. వీటి అమ్మకాలు బాగుండటంతో.. ఇదే బ్రాండ్‌కు నకిలీ మందులు తయారు చేస్తున్నారని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ నకిలీలపై ముమ్మర దాడులు నిర్వహించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.