అప్పులు ఎగ్గొట్టి.. ఎన్నాళ్ళు ఇలా…
స్విస్‌కు చెందిన క్రెడిట్ సూసె కంపెనీకి రుణం చెల్లించడంలో విఫలమైన స్పైస్ జెట్ విమాన సంస్థకు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలో బెంచ్ ఇవాళ స్పైస్‌జెట్ సంస్థ అప్పీల్‌ను విచారణకు స్వీకరించింది. స్విస్ కంపెనీకి స్పైస్‌జెట్ 2.4 కోట్ల డాలర్లు చెల్లించాల్సి ఉంది. రుణం చెల్లించకపోవడంతో స్విస్ కంపెని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. కంపెనీని వేలం వేయాల్సిందిగా సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. దీనిపై డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్ళింది. అక్కడ కూడా ఇదే తీర్పు రావడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ”మీది చాలా బిజీ ఎయిర్‌లైన్ సంస్థ. మరి అప్పులు చెల్లించకుండా ఎలా ఉంటారు. మూడు వారాల్లోగా అప్పులు చెల్లించండి. లేకుంటే మేము కూడా కంపెనీని వేలం వేయమని ఆదేశిస్తామ’ని బెంచ్ పేర్కొంది. కంపెనీ ఆర్థిక స్థితికి సంబంధించిన వివరాలు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈలోగా కంపెనీ వేలం వేయాలన్న హైకోర్టు తీర్పుపై స్టే విధించింది.