For Money

Business News

స్మృతి ఫ్యామిలీకి బార్‌తో లింక్‌ ఇదిగో…

గోవాలోని సిల్లీ సోల్స్‌ గోవా కేఫ్‌ అండ్‌ బార్‌ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ బార్‌తో స్మృతి ఇరానీ కమార్తెకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ… కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేష్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసు ఇచ్చిన 24 గంట్లలోనే ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ మొత్తం వ్యవహారంపై ప్రత్యేక కథనం రాసింది. ఈ కథనంతో ఢిల్లీ హైకోర్టు కామెంట్లు ఇపుడు న్యాయవాద వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి.
ఇదీ సంగతి…
స్మతి ఇరానీ కుటుంబ సభ్యులు వాటాదారులుగా ఉన్న ఓ కంపెనీనే సిల్లీ సోల్స్‌ బార్‌ను నడుపుతున్నట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనంతో వెల్లడైంది. సిల్లీ సోల్స్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను ఎయిటాల్‌ ఫుడ్‌ అండ్‌ బ్రూవరేజస్‌ ఎల్‌ఎల్‌పీ (Eightall Food and Beverages LLP)నిర్వహిస్తోంది. ప్రభుత్వం వద్ద జీఎస్టీ నంబర్ కోసం ఈ కంపెనీ సమర్పించిన చేసిన దరఖాస్తులో తను ఫలానా అడ్రస్‌లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఆ అడ్రస్‌ సిల్లీ సోల్స్‌ కేఫ్‌ అండ్‌ బార్‌ది కావడం గమనార్హం. అంటే ఈ బార్‌ను నడుపుతున్నది ఎయిటాల్‌ ఫుడ్‌ అండ్‌ బ్రూవరేజెస్‌ ఎల్‌ఎల్‌పీనే అని స్పష్టమైంది. మరి ఈ కంపెనీ ఎవరిది అంటే .. ఈ కంపెనీలో 25 శాతం వాటా ఉగ్రయా ఆగ్రో ఫామ్స్‌ (Ugraya Agro Farms Pvt Ltd)కంపెనీది కాగా, 50శాతం వాటా ఉగ్రయా మర్కంటైల్‌ (Ugraya Mercantile Pvt Ltd) కంపెనిది. అంటే ఈ రెండు కంపెనీలకు ఎయిటాల్‌లో 75 శాతం వాటా ఉందన్నమాట. మిగిలిన 25 శాతం వాటా ఆ కంపెనీ ఆడిటర్‌కే (Yogesh K Vajani and Co Chartered Accountants) ఉంది. కంపెని రిజిస్టర్‌ ఆఫీస్‌ కూడా ఆడిటింగ్‌ ఆఫీసుదే కావడం విశేషం. మరి 75 శాతం వాటా ఉన్న ఈ రెండు కంపెనీల వాటాదారులు ఎవరిని పరిశీలిస్తే… ఇవి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుటుంబ సభ్యులదేనని తేలింది. కేంద్ర ప్రభుత్వానికి ఈ కంపెనీలు సమర్పించిన డేటా ప్రకారం చూస్తే…ఉగ్రయా ఆగ్రోలో జుబిన్‌ ఇరానీ (స్మృతి భర్త), జొయాష్‌ ఇరానీ (స్మృతి కుమార్తె), జోహర్‌ ఇరానీ (స్మృతి కుమారుడు) షనెలీ ఇరాని (స్మృతి భర్త జుబిన్‌ మొదటి భార్య కుమార్తె) వాటాదారులు. వీరిలో మెజారిటీ వాటా 67 శాతం జుబిన్‌ ఇరానీకి ఉండగా, కుటుంబ సభ్యులకు మిగిలిన వాటా ఉంది. ఇక ఉగ్రయా మర్కంటైల్‌ కంపెనీలో కూడా వీరికే ఇదే నిష్పత్తిలో వాటా ఉంది. కాకపోతే ఈ రెండు కంపెనీలో మంత్రి స్మృతి ఇరానీకి మాత్రం వాటా లేదు.
ఇలా రెండు కంపెనీల ద్వారా కేఫ్‌ అండ్‌ బార్‌ నిర్వహిస్తున్న ఎయిటాల్‌ కంపెనీలో 75 శాతం పెట్టుబడి పెట్టడంతో పాటు రూ.30 లక్షలను స్వల్ప కాలిక రుణంగా ఇచ్చారు. అంటే తమ కంపెనీకి తామే రుణం ఇచ్చారన్నమాట. గోవాలో సిల్లీ సోల్స్‌ కేఫ్‌ అండ్‌ బార్‌ను ఎయిటాల్‌ నిర్వహిస్తున్నా… సదరు బార్‌కు లైసెన్స్‌ మాత్రం కేఫె డీన్‌ డి గామా (café Dean D’Gama) పేరుతో ఉంది. ‘మీరు వ్యాపారం చేస్తున్న అడ్రస్‌తోనే సిల్లీ సోల్స్‌ బార్‌ కూడా నడుస్తోంది కదా’ అంటూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి ప్రశ్నించగా… అందుకే సమాధానం ఇచ్చేందుకు కేఫ్‌ డీన్‌ డి గామా యజమాని నిరాకరించారు. అలాగే ఆడిటర్లు కూడా. సింపుల్‌గా చెప్పాలంటే తమ కుటుంబానికి చెందిన రెండు కంపెనీల ద్వారా మరో కంపెనీలో 75 శాతం వాటా తీసుకుని… వేరే వారి పేరుతో లైసెన్స్‌ ఉన్న బార్‌లో స్మృతి ఇరానీ ఫ్యామిలీ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను నిర్వహిస్తోందన్నమాట.