అదానీలపై రేపు సుప్రీం తీర్పు
అదానీ గ్రూప్‌ను ఓ కుదుపు కుదిపిన హిండెన్‌బర్గ్ నివేదిక కేసులో రేపు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో విచారణ గత నెలలో ముగిసింది. తీర్పును కోర్టు వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం రేపు తీర్పు ఇవ్వనుంది. హెండిన్బర్గ్ నివేదిక ఈ ఏడాది జనవరిలో వచ్చింది. ఆ నివేదిక తరవాత అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష కోట్ల డాలర్ల మేరకు తగ్గింది. ఈ నేపథ్యంలో సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషన్‌తో మరికొందరు పిటీషనర్లు అదానీ గ్రూప్ వ్యవహారాలపై విచారణ కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆరుగురు సభ్యుల కమిటీని సుప్రీం కోర్టు నియమించడం, ఆ కమిటీ నివేదిక ఇవ్వడం కూడా అయిపోయింది. ఈ నివేదిక తరవాత విచారణ సమయంలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలతో అదానీ గ్రూప్ షేర్లలో భారీ ర్యాలీ వచ్చింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యలు… అదానీ గ్రూప్‌నకు క్లీన్‌చిట్‌గా స్టాక్ మార్కెట్ భావించింది. అయితే తుది తీర్పులో సుప్రీం కోర్టు ఏమంటుందో రేపు తెలియనుంది.