For Money

Business News

ఎస్‌బీఐ నికరలాభంలో 55 శాతం వృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఎస్‌బీఐ నికర లాభం 55.25 శాతం వృద్ధితో రూ.6,504 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం రూ.4,189 కోట్లుగా ఉంది. 2008 తర్వాత ఒక త్రైమాసికంలో ఇంత భారీ స్థాయిలో లాభాలు ఆర్జించడం ఇదే మొదటిసారని ఎస్‌బీఐ చైర్మన్‌ దినేష్‌ కుమార్‌ ఖారా వెల్లడించారు. తొలి త్రైమాసికంలో కన్సాలిడేషన్‌ ఎస్‌బీఐ నికర లాభం రూ.5,203.49 కోట్ల నుంచి రూ.7,539.22 కోట్లకు పెరిగింది. ఎన్‌పీఏలకు కేటాయించిన మొత్తం తగ్గడం వల్ల నికర లాభంపై ఒత్తిడి తగ్గింది. ఎన్‌పీఏ 5.44 శాతం నుంచి 5.32 శాతానికి, నికర ఎన్‌పీఏలు 1.86 శాతం నుంచి 1.77 శాతానికి తగ్గాయి. గతంలో మాదిరి రుణ నష్టాల కేటాయింపులే రూ.9,420 కోట్ల నుంచి రూ.5,030 కోట్లకు (46.61 శాతం) తగ్గడం క్యూ1లో నికర లాభం పెరిగింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) రూ.26,642 కోట్ల నుంచి రూ.27,638 కోట్లకు, వడ్డీయేతర ఆదాయం 24.28 శాతం వృద్ధితో రూ.11,803 కోట్లకు చేరింది. అంటే బ్యాంక్‌ పనితీరు కంటే ఎన్‌పీఏల భారం తగ్గడం, కేటాయింపులు తగ్గడం వల్ల నికర లాభం భారీగా పెరిగింది. గతంలో వచ్చిన లాభాల నుంచి ఎన్‌పీఏలకు కేటాయించి భారీ నష్టాలు ప్రకటించిన ఎస్‌బీఐ ఇపుడు … వసూలైన రుణాలను లాభాల్లో చూపించడం ప్రారంభించింది. ఉదాహరణకు కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు ఇచ్చిన రుణాల్లో రూ.1,692 కోట్లను తొలి త్రైమాసి కంలో వసూలు చేసుకోగలిగినట్లు చైర్మన్‌ దినేష్‌ ఖారా తెలిపారు. మొండిబకాయిల వసూలు పెరిగే కొద్దీ బ్యాంకు లాభాలు మరింత పెరిగే అవకాశముంది.