For Money

Business News

అమిత్‌ షా షేర్ల లిస్ట్‌లో అదానీ మిస్‌!

లోక్ సభ ఎన్నికలు – 2024కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గత శుక్రవారం ఆయన నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆయన ఆస్తి అప్పుల వివరాలు వెల్లడించారు. అందులో తనకు రూ.36 కోట్ల విలువైన చరాస్తులు, స్థిరాస్తులు ఉన్నాయని అమిత్ షా పేర్కొన్నారు. తనకు సొంత కారు కూడా లేదని చెప్పారు. రూ.20 కోట్ల చరాస్తులు ఉన్నాయని, స్థిరాస్తుల విలువ రూ.16 కోట్లు అని పేర్కొన్నారు. తన వద్ద రూ.72 లక్షల విలువైన బంగారం, వెండి, తన భార్య వద్ద ఉన్న నగలు రూ.1.10 కోట్లు విలువైనవి అని అఫిడవిట్‌లో స్పష్టం చేశారు.ఈ సందర్భంగా తన వద్ద షేర్ల జాబితాను కూడా సమర్పించారు. షేర్ల సంఖ్య తక్కువగా ఉన్నా… హిందుస్థాన్‌ లీవర్‌, ఎంఆర్‌ఎఫ్‌ నుంచి ప్రొక్టర్‌ అండ్‌ గాంబుల్‌ వరకు పలు బ్లూచిప్‌ కంపెనీల షేర్లు ఆయన వద్ద ఉండటం విశేషం. హిందుస్థాన్‌ లీవర్‌లో రూ. 1.4 కోట్లు, ఎంఆర్‌ఎఫ్‌లో రూ. 1.3 కోట్లతో పాటు రూ. 1.1 కోట్ల విలువైన పీ అండ్‌ జీ షేర్లు ఆయన వద్ద ఉన్నాయి. షేర్లలో మొత్తంగా ఆయన వద్ద రూ. 17.4 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. ఆయన భార్య సోనాల్‌ పేరున కూడా రూ. 20 కోట్ల రూపాయల షేర్లు ఉన్నాయి. ఆమె షేర్ల లిస్ట్‌లో టాప్‌లో సన్‌ ఫార్మా, కరూర్‌ వైశ్యా బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, కెనరా బ్యాంక్‌, గుజరాత్ ఫ్లోరో కెమికల్స్‌, లక్ష్మీ మెషిన్‌ షేర్లు ఉన్నాయి. అయితే అనిల్‌ అంబానీకి చెందిన కొన్ని కంపెనీలు అమిత్‌ షా జాబితాలో ఉన్నాయి. అదానీ గ్రూప్‌నకు చెందిన ఒక్క కంపెనీ షేర్లు కూడా అమిత్‌ షా వద్ద లేకపోవడం విశేషం.

Leave a Reply