For Money

Business News

డాక్టర్లకు డోలో ‘నజరానా’ రూ.1000 కోట్లు!

తమ బ్రాండ్‌ ఉత్పత్తులను రాయమని డాక్టర్లకు కమీషన్లు ఆశగా చూపడం ఫార్మా రంగంలో ఎపుడూ ఉన్నదే. కాని ఏకంగా రూ. 1000 కోట్ల బహుమతులను ఆఫర్‌ చేసింది బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్‌. జ్వరం, నొప్పుల నివారణకు వినియోగించే డోలో 650 మాత్రల తయారు చేసే ఈ కంపెనీపై ఇటీవల ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడులకు సంబంధించిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఓ ప్రతికా ప్రకటన విడుదల చేసింది. కంపెనీ అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారని డాక్టర్లకు భారీ ఎత్తున నజరానాలు ఇచ్చి తమ మందును ప్రమోట్‌ చేయించుకున్నారని CBDT పేర్కొంది. 9 రాష్ట్రాల్లో కంపెనీకి చెందిన 36 ఆఫీసుల్లో జులై 6న ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఈ దాడుల్లో లెక్కల్లో చూపని రూ .1.2 కోట్ల నగదు, రూ. 1.4 కోట్ల వజ్రాభరణాలు, బంగారాన్ని జప్తు చేసినట్లు CBDT పేర్కొంది. ప్రాథమిక సాక్ష్యాధారాల ప్రకారం.. ఉచితాల కింద ప్రయాణ వ్యయాలు, బహు మతులు తదితరాలను డాక్టర్లకు మైక్రోల్యాబ్‌ ఇచ్చిందని CBDT పేర్కొంది. వీటి విలువ రూ.1,000 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేసినట్లు వివరించింది. CBDT తన ప్రకటనలో ఈ కంపెనీ పేరు అధికారికంగా చెప్పకపోయినా… అనధికారికంగా ఐటీ అధికారులు ధృవీకరిస్తున్నారు.