For Money

Business News

రిలయన్స్‌ చేతికి క్యాంపా!

గతంలో కోలా డ్రింక్‌ అంటే క్యాంపానే. సాఫ్ట్‌ డ్రింక్‌ మార్కెట్‌లో లీడర్‌గా ఉన్న క్యాంపా… తరవాత 1990లలో కోక కోలా, పెస్సి దెబ్బకు కనుమరుగైంది. ఢిల్లీకి చెందిన ప్యూర్‌ డ్రింక్స్‌ గ్రూప్‌నకు చెందిన ఈ బ్రాండ్‌ను ఇపుడు రిలయన్స్‌ కంపెనీ కొనుగోలు చేసింది. ఈ బ్రాండ్‌ను రూ. 22 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీపావళి కల్లా ఈ డ్రింక్‌ మార్కెట్‌లోకి తీసుకురావాలని రిలయన్స్‌ భావిస్తోంది. కోలా ఫ్లేవర్‌తోపాటు లెమన్‌, ఆరంజ్‌ ఫ్లేవర్‌లో క్యాంపా వచ్చేది. మరి ఈ సారి ఏయే ఫ్లేవర్స్‌లో వస్తుందో చూడాలి. ఎఫ్‌ఎంసీజీ మార్కెట్‌లో భారీ ఎత్తున ప్రవేశించాలని భావిస్తున్న రిలయన్స్‌ ఇంకా పలు ప్రాంతీయ బ్రాండ్లను కొనుగోలు చేసే యత్నాల్లో ఉంది. కొనుగోలుకు దాదాపు పాతిక బ్రాండ్లను పరిశీలిస్తోంది. గతంలో కోక కోల ఇండియా ఛైర్మన్‌గా ఉన్న టి కృష్ణకుమార్‌ ఇపుడు రిలయన్స్‌ ఎఫ్‌ఎంసీజీ వ్యాపార విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. రిలయన్స్‌కు చెందిన రీటైల్‌ స్టోర్లు, జియో మార్ట్‌తో పాటు మరో 15 లక్షల కిరాణా దుకాణాల ద్వారా క్యాంపాను రిలయన్స్‌ మార్కెట్‌ చేయనుంది. దక్షిణాదికి చెందిన ఓ పాపులర్‌ బ్రాండ్‌ను టేకోవర్‌ చేసేందుకు రిలయన్స్‌ ప్రయత్నిస్తోంది. సబ్బులు, వంటనూనెలతో పాటు తినుబండారాలను తయారు చేసే ఈ కంపెనీతో రిలయన్స్‌ ఇప్పటికే చర్చలు ప్రారంభించింది.