For Money

Business News

3 నెలలకు ఐపీఓ ఇన్వెస్టర్లకు లాభాలు

హైదరాబాద్‌కు చెందిన రెయిన్‌బో చిల్ట్రన్స్‌ మెడికేర్‌ లిమిటెడ్‌ (రెయిన్‌బో హాస్పిటల్స్‌) పబ్లిక్‌ ఇష్యూకు దరఖాస్తు చేసిన ఇన్వెస్టర్లకు సరిగ్గా మూడు నెలలకు లాభాలు వచ్చాయి. కంపెనీ పబ్లిక్‌ ఆఫర్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 27 నుంచి 29 వరకు కొనసాగిన విషయం తెలిసిందే. ఈ షేర్‌ ఆఫర్‌ ధరలో గరిష్ఠ ధర రూ. 542లకు ఈ కంపెనీ షేర్లను కేటాయించింది. పబ్లిక్‌ ఇష్యూ షేర్లు మే 10న లిస్టయ్యాయి. కాని ఓపెనింగ్‌ రోజున 6.6 శాతం డిస్కౌంట్‌తో లిస్టయిన ఈ షేర్‌ ఆ రోజే నుంచే క్షీణిస్తూ వచ్చింది. మే 17వ తేదీన షేర్‌ రూ. 410ను తాకడంతో ఇన్వెస్టర్లు 30 శాతం దాకా నష్టపోయారు. ఆ తరవాత కోలుకున్నా ఇష్యూ ధరను మాత్రం తాకలేదు. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ అద్భుత ఫలితాలు ప్రకటించడంతో పాటు ఈ త్రైమాసికంలో చెన్నైలో హాస్పిటల్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో షేర్‌ పరుగులు పెడుతోంది. నిన్న దాదాపు పది శాతం లాభంతో రూ. 533.45 వద్ద ముగిసింది. అంటే నిన్న కూడా ఇష్యూలో షేర్లు పొందిన ఇన్వెస్టర్లకు లాభాలు అందలేదన్నమాట. కాని ఇవాళ షేర్‌ మరో రూ. 37.55లు పెరిగి రూ. 571 వద్ద ముగిసింది. సో… ఇవాళ ఆఫర్‌ నుంచి కొనసాగిన ఇన్వెస్టర్లకు లాభాలు వచ్చాయి. ఈలోగా కంపెనీ ఆర్థిక పనితీరుపై విశ్వాసముండి కొనుగోలు చేసినవారికి మంచి లాభాలు దక్కాయి. దేశంలో చిన్న పిల్లల హాస్పిటల్స్‌ తక్కువగా ఉండటం.. పైగా హాస్పిటల్‌ రంగానికి చెందిన షేర్లను ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు రెకమెండ్‌ చేస్తుండటంతో రెయిన్‌బో హాస్పిటల్‌ మరింత పెరిగే అవకాశముందనిపిస్తోంది. ఇక్కడి నుంచి ఈ షేర్‌ తొలి టార్గెట్ రూ. 585, రెండో టార్గెట్‌ రూ. 625గా పేర్కొంటున్నారు. రూ. 475 స్టాప్‌లాస్‌తో ఈ షేర్‌ను కొనుగోలు చేయొచ్చని సిఫారసు చేస్తున్నారు.