రాజ్యాంగ విరుద్ధంగా విద్యుత్ సంస్కరణల అమలు
దేశ వ్యాప్తంగా విద్యుత్ సంస్కరణల అమలు కోసం సంబంధించిన చట్టం ఇంకా పార్లమెంటు ఆమోదం పొందలేదని… కాని ఆ సంస్కరణలను కేంద్రం అమలు చేస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేయడమంటే… రైతు మీటర్లకు విద్యుత్ కనెక్షన్లు పెట్టడమేనని ఆయన అన్నారు. ఇవాళ ఆయన ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ… విద్యుత్ సంస్కరణలను తాము వ్యతిరేకించడం వల్ల అయిదేళ్ళలో రూ.25000 కోట్ల నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఏడాదికి రూ. 5000 కోట్లు (ఎఫ్‌ఆర్‌బీఎంలో 0.5 శాతం పెంచడం) చొప్పున అయిదేళ్ళు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించదన్నారు. తాము వ్యతిరేకించినందున రూ.25,000 కోట్లు నష్టపోతోందన్నారు. విద్యుత్ సంస్కరణలు అమలుకు ముందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకాకుళంలో విద్యుత్ మీటర్లు పెడుతోందని అన్నారు. ఇప్పటికే ఆ జిల్లాలో 25,000 మీటర్లు బిగించారని అన్నారు. మిగిలిన జిల్లాల కోసం ఆ రాష్ట్రం ఇప్పటికే టెండర్లు కూడా పిలిచిందన్నారు. ఒక్కో మీటర్ రూ.3,000 చొప్పున కొనుగోలు చేసేందుకు టెండర్లు పిలిందన్నారు. ఏపీ ప్రభుత్వం వీటి కోసం రూ.730 కోట్లు కేటాయించిందన్నారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేయడం లేదని తమ రాష్ట్రానికి రుణం ఇవ్వకుండా ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ సంస్థలపై కేంద్రం ఒత్తిడి తెస్తోందన్నారు. ఆర్థిక సంస్కరణల ప్రధాన ఉద్దేశం రైతులకు మీటర్లు బిగించి… భవిష్యత్‌లో సబ్సిడీ కట్ చేయడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని కేసీఆర్ గత కొన్ని నెలలుగా ఆరోపిస్తున్నారు.