ఏపీకి రూ. 9,574 కోట్ల అదనపు రుణం
దేశ వ్యాప్తంగా విద్యుత్ రంగంలో సంస్కరణలు తేవాలని, విద్యుత్ పంపిణీని ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. కరోనా వంటి విషమ సమయంలో కేంద్రం ఈ సంస్కరణలను తెచ్చింది. సంస్కరణలను తెచ్చిన రాష్ట్రాలకు అదనంగా రుణం తీసుకునే వెసులుబాటు ఇస్తామని పేర్కొంది. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం, క్రాస్ సబ్సిడీ తగ్గించడంతో పాటు ప్రీపెయిడ్ మీటర్లు పెట్టడం వంటి సంస్కరణలు తెస్తే భారీగా రుణాలు ఇస్తామని ఆశ చూపింది. సదరు సంస్కరణలు తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. 2021-22, 2022-23 విద్యుత్ సంస్కరణలు తెచ్చిన 12 రాష్ట్రాలకు రూ. 66,413 కోట్లను అదనంగా రుణం తీసుకునేందుకు ఇవాళ కేంద్రం అంగీకరించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల కోసమే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించినట్లు స్పష్టమైంది. క్రాస్ సబ్సిడీలో కోత విధించడంతో పాటు ప్రి పెయిడ్ విద్యుత్ మీటర్ల బిగింపు కూడా అదనపు రుణం పొందేందుకే. వీటితో పాటు అనేక ఆంక్షలను కేంద్రం విధించింది. వీటన్నింటిని అమలు పర్చిన 12 రాష్ట్రాలకు అదనంగా రుణం పొందేందుకు కేంద్రం అంగీకరించింది. 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో ఈ రాష్ట్రాలు అమలు చేసిన విద్యుత్ సంస్కరణలను చూసి కేంద్రం… అదనపు రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యుత్ సంస్కరణలు తెచ్చిన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్‌కు రూ. 15,263 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు ఓకే చెప్పింది. అలాగే రాజస్థాన్ ప్రభుత్వం రూ. 11,308 కోట్ల అదనపు రుణం పొందనుంది. రూ. 9,574 కోట్ల అదనపు రుణంతో ఏపీ ప్రభుత్వం మూడో స్థానంలో ఉంది. కేరళ రాష్ట్రానికి కూడా రూ. 8,323 కోట్ల అందనున్నాయి. తమిళనాడుకు రూ. 7,054 కోట్ల అదనపు రుణం లభించనుంది. మొన్నటి దాకా అధికారంలో ఉన్న కర్ణాటక ఈ జాబితాలో లేదు.
తెలంగాణ ససేమిరా
విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించేందుకు ససేమిరా అంది. దీనితో పాటు విద్యుత్ పంపిణీని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించే ప్రతిపాదనను కూడా తిరస్కరించింది. దీంతో ఈ రాష్ట్రానికి అదనుపు రుణం పొందే అర్హత దక్కలేదు. ఇప్పటి వరకు విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకురాని రాష్ట్రాలు 2023-24లో తీసుకు రావచ్చని కేంద్రం ఇవాళ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలు తెచ్చే రాష్ట్రాలు మరో లక్షా 43వేల కోట్ల రూపాయల వరకు అదనపు రుణం తీసుకునే అవకాశం ఇస్తామని ఇవాళ కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించింది.