బస్సు సరఫరా ఆర్డరు రద్దు?

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు ఇచ్చిన ఎలక్ట్రికల్ బస్సు ఆర్డర్లను రద్దు చేసుకుంటున్నట్లు మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ పోస్ట్ చేశారు. ఈ ఏడాది మే 22 నాటికి కంపెనీ 1000 బస్సులను డెలివరీ చేయాల్సి ఉండగా.. ఒక్కటి కూడా అందించలేదని ఆయన ఆరోపించారు. దీనిపై ఎకనామిక్ టైమ్స్ పత్రిక ప్రత్యేక కథనం రాసింది. కంపెనీ ఇచ్చిన మాట ప్రకారం బస్సులను సరఫరా చేయలేదని, దీంతో 5,150 ఎలక్ట్రిక్ బస్సుల కోసం గతంలో తాము ఇచ్చిన టెండర్‌ను రద్దు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ కంపెనీ ఆర్డర్ల మేరకు బస్సులను సరఫరా చేస్తుందన్న ఆశ తమకు లేదని ఆయన అన్నారు. అయితే ఆర్డర్ల రద్దుకు సంబంధించి తమకు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్డర్లు రాలేదని ఒలెక్ట్రా కంపెనీ తెలిపింది. అయితే గత వారం కంపెనీ త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన కంపెనీ… తమ వద్ద 10,022 బస్సుల కోసం ఆర్డర్లు ఉన్నాయని పేర్కొంది.