For Money

Business News

ఇక మీరూ అమెరికా షేర్లు కొనొచ్చు

ఇవాళ్టి నుంచి మనదేశంలోని రీటైల్‌ ఇన్వెస్టర్లు కూడా అమెరికాలోని 8 ప్రధాన కంపెనీల షేర్లు కొనుగోలు చేయొచ్చు. నేషనల్ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్‌ (ఐఎఫ్‌ఎస్‌సీ) ఈ సౌకర్యం ఇవాళ్టి నుంచి అందిస్తోంది. NSE IFCI అమెరికాకు చెందిన 50 షేర్లలో ట్రేడింగ్‌కు అనుమతి పొందింది. ప్రస్తుతం ఆల్ఫాబెట్‌, అమెజాన్‌, టెస్లా, మెటా, మైక్రోసాఫ్ట్‌, నెట్‌ఫ్లిక్స్‌, యాపిల్‌, వాల్‌మార్ట్‌ షేర్లను మీరు కొనుగోలు చేయొచ్చు. ఈ షేర్లలో ఇవాళ్టి నుంచే లావాదేవీలు నిర్వహించవచ్చు. ఇంకా లిస్టింగ్‌కు అనుమతి పొందిన షేర్లలో బెర్క్‌షైర్‌ హాథ్‌వే, మాస్టర్‌ కార్డ్‌, జేపీ మోర్గాన్‌, మోర్గాన్‌స్టాన్లీ, నైక్‌, పేపాల్‌, పెప్సికో, ఫైజల్‌, ఇంటెల్‌ షేర్లు కూడా ఉన్నాయి. వీటిలో ట్రేడింగ్‌ ఎప్పటి నుంచి అనుమతిస్తారో తరవాత తెలుపుతారు. అమెరికా కంపెనీల షేర్లు ఇక్కడ లిస్ట్‌ కావడం లేదు. అయితే మార్కెట్‌ మేకర్స్‌ షేర్స్‌ను కొని అన్‌స్పాన్సర్డ్‌ డిపాజిటరీ రిసీట్స్‌ ఇస్తారని ఎక్స్ఛేంజీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ షేర్లను కొనాలనుకునేవారు ఐఎఫ్‌ఎస్‌సీ ప్లాట్‌ఫామ్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేయాల్సి ఉంటుంది. రిజర్వు బ్యాంకు అనుమతించిన మొత్తం ఏడాదికి 2,50,000 డాలర్లను ఈ షేర్లలో పెట్టుబడి పెట్టొచ్చు.