For Money

Business News

కీలక మద్దతు స్థాయి పోయింది

మార్కెట్‌ అత్యంత కీలక స్థాయి అయిన 17500ని నిఫ్టి ఇవాళ కోల్పోయింది. దాదాపు అన్ని రంగాల షేర్ల నుంచి వచ్చిన ఒత్తిడితో ఉదయం నుంచి నిఫ్టి బలహీనంగా ఉంటూ వచ్చింది. నిన్న వీక్లీ డెరివేటివ్స్‌ ముగింపు కారణంగా నిఫ్టికి మద్దతుగా నిలచిన ఆపరేటర్లు ఇవాళ నిఫ్టిని వొదిలేశారు. ఆరంభంలో 17642కు చేరిన నిఫ్టి క్లోజింగ్‌ ముందు 17291ని తాకింది. అక్కడి నుంచి స్వల్పంగా కోలుకుని 17327 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 302 పాయింట్ల నష్టపోయింది. ఎగుమతి ప్రధాన ఐటీ, ఫార్మా షేర్లలో ఎంపిక చేసినవాటికి మినహా… మిగతా ఏ రంగానికి మద్దతు అందలేదు. ఇవాళ ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ షేర్లలో తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఇన్నాళ్ళూ నిఫ్టికి మద్దుతుగా ఉన్నా నిఫ్టి బ్యాంక్‌ ఇవాళ కుప్పకూలింది. నిఫ్టి బ్యాంక్‌ 2.67 శాతం నష్టపోగా, నిఫ్టి ఫైనాన్షియల్స్‌ 2.4 శాతం నష్టపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌తోపాటు మెటల్స్‌ షేర్లలో అమ్మకాలు జరిపారు. ఇక నిఫ్టిలో దివీస్‌, సన్‌ ఫార్మా, సిప్లా టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. నిఫ్టిలో 48 షేర్లు నష్టాల్లో ముగిశాయంటే… ఏ స్థాయిలో అమ్మకాల ఒత్తిడి వచ్చిందో గమనించవచ్చు.