For Money

Business News

ఈ పతనం ఎందాక?

పేటీఎం ప్రకటనలపై ప్రధాని మోడీ ఫొటో చూసి ఈ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు దరఖాస్తు చేసిన ఇన్వెస్టర్లు ఇపుడు లబోదిబో మంటున్నారు. ఫిన్‌ టెక్‌ రంగంలో పెను సంచలనం సృష్టించిన ఈ కంపెనీ పబ్లిక్‌ ఆఫర్‌ సమయంలోనూ రికార్డు సృష్టించింది. చిత్రమేమిటంటే… లిస్టింగ్‌ తరవాత కూడా ఈ కంపెనీ చెత్త రికార్డులు సృష్టిస్తోంది. పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (One97 Communication) షేర్లు ఇవాళ పతనంలో కొత్త రికార్డు సృష్టించాయి. మార్కెట్‌ ఆరంభంలోనే పేటీఎం షేర్‌లో ఇన్వెస్ట్‌ చేయొద్దని చాలా మంది అనలిస్టులు హెచ్చరించారు. పేటీఎం ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయి రూ. 510 కాగా… ఇవాళ ఓపెనింగ్‌లోనే పతనం ఆరంభమైంది. లాక్‌ ఇన్‌ పీరియడ్‌ పూర్తయిన తరవాత యాంకర్‌ ఇన్వెస్టర్లు ఒక్కొక్కరు బయట పడుతున్నారు. ప్రమోటర్‌ సంస్థ సాఫ్ట్‌ బ్యాంక్‌ కూడా భారీ నష్టంతో బయటపడింది. లాక్‌ఇన్ పిరియడ్ నవంబర్ 15, 2022న ముగిసింది. సాఫ్ట్‌బ్యాంక్ గతవారమే తన వాటాలో 4.5 శాతం వాటాను విక్రయించింది. ఒక్కో షేరు రూ.555-రూ.601 రేటుకి నష్టాలతోనే షేర్లు అమ్ముకుంది. తీవ్ర నిధుల కొరత ఎదుర్కొంటున్న సాఫ్ట్‌ బ్యాంక్‌ నష్టాలతో అమ్ముకోక తప్పలదేని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. అతిపెద్ద ఇన్వెస్టరే షేర్లు అమ్మివేయడంతో మిగతా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతింది. బీఎస్‌ఈలో ఈ షేర్‌ ఇవాళ 11.44 శాతంతో నష్టంతో రూ.477.55 వద్ద ముగిసింది. పేటీఎం షేర్లకు ఇది కొత్త ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయి. గతేడాది నవంబర్ 18, 2021న లిస్టింగ్ తేదీ నుంచి ఇప్పటివరకు మొత్తం 69.53 శాతం మేర పతనమైంది. ఇంత పతనమైనా… కొనడానికి ఇది సరైన ధర కాదని అనలిస్టులు అనడంతో… ఈ కౌంటర్‌ మరింత బలహీన పడింది.