For Money

Business News

షేర్ల బదిలీ ఇపుడు కుదరదు

తమ కంపెనీలో 29.18 శాతం వాటా దక్కించుకున్న అదానీ గ్రూప్‌కు ఎన్‌డీటీవీ షాక్‌ ఇచ్చింది. తాము వాటా కొన్నామని, రెండు రోజుల్లో షేర్లను బదిలీ చేయాలని అదానీ కంపెనీ లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే తాము ఇపుడు షేర్లను బదిలీ చేయలేమని ఎన్‌డీటీవీ పేర్కొంది. ఎన్‌డీటీవీ ప్రమోటర్లయిన ప్రణయ్‌ రాయ్‌, రాధికా రాయ్‌లపై క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఇది వరకే ఆంక్షలు విధించింది. సెక్యూరిటీ మార్కెట్‌ నుంచి రెండేళ్లపాటు నిషేధిస్తూ వీరిద్దరిపై 2020 నవంబరు 27న సెబీ ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ఎన్‌డీటీవీ ప్రస్తావించింది. దాంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా షేర్ల క్రయవిక్రయాలు, సెక్యూరిటీల బదిలీ లేదా మరి ఇతర కార్యకలాపాలు జరపడానికి వీల్లేదని పేర్కొంది. ఒకవేళ బదిలీ చేయాలంటే సెబికి దరఖాస్తు చేసుకుని, అనుమతి పొందాక మాత్రమే బదిలీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నిషేధం గడువు 2022 నవంబరు 26తో ముగియనుంది. లిస్టెడ్‌ కంపెనీ అయిన ఎన్‌డీటీవీలో పరోక్షంగా 29.18 శాతం వాటా కొనుగోలు చేసిన అదానీ గ్రూప్‌.. సెబీ నిబంధనల ప్రకారం, మార్కెట్‌ నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకు ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. అయితే తమ పేరున షేర్లు ఇంకా బదిలీ కాలేదు కాబట్టి… ఓపెన్‌ ఆఫర్‌ తేదీ ప్రకటించలేదు. అలాగే 26 శాతం షేర్లకు ఓపెన్‌ ఆఫర్‌ చేయనున్నారు. ఎంత మంది వాటాదారులు షేర్లు అమ్ముతారో ఆ మేరకు ఎన్‌డీటీవీలో అదానీ గ్రూప్‌ వాటా పెరగనుంది. అదానీ ఆఫర్‌ ధర రూ.294 కాగా, నిన్న మార్కెట్‌లో షేర్‌ రూ. 407 వద్ద ముగిసింది. దీంతో వాటాదారులు ఆఫర్‌ కింద షేర్లను అమ్మడం కష్టమే.