వాల్‌స్ట్రీట్‌లో ‘యుద్ధ పండుగ’
రష్యా కంపెనీలు, బ్యాంకులపై అమెరికా భారీగా ఆంక్షలు విధించడం ఆ దేశ స్టాక్ మార్కెట్లకు పాజిటివ్‌గా మారింది. ముఖ్యంగా టెక్నాలజీ షేర్లు రాత్రి దూసుకుపోయాయి. భారీ డిమాండ్ వచ్చింది. నిన్న రాత్రి వాల్‌స్ట్రీట్ ప్రపంచ మార్కెట్లకు భిన్నంగా స్పందించింది. ఆసియా, యూరో మార్కెట్లు నాలుగు శాతం వరకు నష్టపోగా.. రాత్రి నాస్డాక్ 3.38 శాతం లాభంతో ముగిసింది. ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 1.5 శాతం లాభంతో ముగిసింది. డౌజోన్స్ ఒక్కటే 0.28 శాతం లాభాలకే పరిమితమైంది. రష్యాపై విధించిన ఆంక్షల కారణంగా అనేక అమెరికా కంపెనీలకు అనుకూలంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. రష్యా కంపెనీలపై ఆంక్షలు విధించడంతో రష్యా కంపెనీల వ్యాపారం అమెరికా కంపెనీలకు బదిలీ అవుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా రక్షణ సంబంధం వ్యాపారాలు అమెరికాకు కలిసి వచ్చే అవకాశముంది. మరోవైపు డాలర్ కూడా స్థిరంగా ఉండటంతో అమెరికాకు కలిసి వచ్చింది.