For Money

Business News

మళ్లీ ఆంక్షలు… ఈసారి సీరియస్‌

అమెరికా ఈ సారి రష్యాపై తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా వీటీబీ బ్యాంక్‌పై ఆర్థిక ఆంక్షలు విధించడం రష్యాకు తీవ్ర ప్రతికూల అంశమే. అమెరికా ఆంక్షల కారణంగా నిన్న రష్యా స్టాక్‌ మార్కెట్లు కుప్పలకూలాయి. మాస్కో స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ ఏకంగా 37 శాతంపైగా నష్టపోయింది. కోలుకున్నా భారీ నష్టాలు తప్పలేదు. తాజాగా విధించిన ఆంక్షలు రష్యాను మరింత దెబ్బతీసేలా ఉన్నాయి. టెక్నాలజీకి సంబంధించిన ఆంక్షలు కూడా రష్యాకు ప్రతికూలమే. రష్యాలో అతి పెద్ద ఫైనాన్షియల్‌ బ్యాంక్‌ అయిన సెర్‌బ్యాంక్‌, దాని 25 అనుబంధ సంస్థలపై ఆంక్షలు విధించడంతో ఇవాళ కూడా రష్యా మార్కెట్లు కోలుకోవడం కష్టంగా కన్పిస్తోంది. రష్యా బ్యాంకింగ్‌ ఆస్తులు మూడో వంతుఉ సెర్‌ బ్యాంకులో ఉన్నాయి. ఇక వీటీబీ బ్యాంక్‌ రష్యా ప్రభుత్వ బ్యాంక్‌. అంతర్జాతీయంగా రష్యా కంపెనీలకు అండగా ఉంటుంది. లక్షల కోట్ల రుణాలు ఇచ్చింది. ఇపుడు ఈ బ్యాంక్‌పై ఆంక్షలతో రష్యా కంపెనీలు నిధుల సమస్యను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సెబెర్‌ బ్యాంక్‌, ఆల్ఫా బ్యాంక్‌, క్రెడిట్ బ్యాంక్ ఆఫ్ మాస్కో, గజ్రప్రొమ్‌ బ్యాంక్‌, రష్యన్ అగ్రికల్చరల్ బ్యాంక్, గజప్రొమ్‌, గజప్రొమ్‌ నెఫ్ట్‌, ట్రాన్స్‌నెఫ్ట్‌, రాస్‌ టెలికాం, రస్‌ హైడ్రో, అల్రోసా, సోవొకామ్‌ ఫ్లాట్‌, రష్యా రైల్వేలు నిధుల సమీకరణకు అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం విధించారు. ఇంకా రష్యా కుబేరులపై కూడా ఆంక్షలు విధించింది అమెరికా. ముఖ్యంగా రక్షణ, మిలిటరీ సంబంధిత ఆంక్షలు రష్యాను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. అలాగే రక్షణ, విమానయాన, మెరైన్‌ టెక్నాలజీపై కూడా ఆంక్షలు విధించింది.