For Money

Business News

క్షణాల్లో షేర్‌ ధర డబుల్‌

క్యాన్సర్‌ పరిశోధనల్లో మోడర్నా కంపెనీ అద్భుత ప్రగతి సాధించింది. క్యాన్సర్‌ కణితి (గడ్డ)ని తొలగించాక… అవి మళ్ళీ రాకుండా చేసేందుకు కంపెనీ చేసిన పరిశోధన విజయవంతమైనట్లు వార్తలు వస్తున్నాయి. మెర్క్‌ కంపెనీతో కలిసి చేసిన ఈ పరిశోధనలు శాస్త్రవేత్తలు అనుకున్న స్థాయిలో ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. వందల మందిపై జరిపిన పరిశోధనలు విజయవంతమైనట్లు వార్తలు రాగానే మోడెర్నా షేర్‌ క్షణాల్లో రెట్టింపు అయింది. అమెరికా మార్కెట్లు ప్రారంభం కాగానే మోడెర్నా షేర్‌ ఏకంగా 105 శాతం లాభంతో ట్రేడవుతోంది. నిన్న 62.96 డాలర్ల వద్ద ముగిసిన ఈ కంపెనీ షేర్‌ ఇపుడు 133.52 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మెర్క్‌ కంపెనీతో కలిసి ఈ కంపెనీ క్యాన్సర్‌ మందుపై పరిశోధనలు చేస్తోంది. మూడోదశ పరిశోధనలో తాను అనుకున్న ఫలితాలు సాధించినట్లు మోడెర్నా వెల్లడించింది. mRNA క్యాన్సర్‌ థెరపీ మెలొనోమాపై గత కొన్నేళ్ళుగా రెండు కంపెనీలు పరిశోధనలు చేస్తున్నాయి. ఈ వార్తలతో మెర్క్‌ షేర్‌ ధర కూడా ఏడు శాతం పెరిగింది. అధిక రిస్క్‌తో అంటే స్టేట్‌ IIB-IVతో బాధపడుతున్న క్యాన్సర్‌ పేషెంట్లలో కణితులను సర్జరీ ద్వారా తొలగించాక… మళ్ళీ అవి వచ్చే ఛాయలు కన్పించలేదు. 1,137 మందిపై కంపెనీలు ఈ పరిశోధనలు చేస్తున్నాయి. ఈ పరీక్షల్లో మోడెర్నా అభివృద్ధి చేస్తున్న Intismeran Autogeneతో పాటు మెర్క్‌ ఇమ్యూనోథెరపి Keytrudaను పేషెంట్లలో వాడినట్లు కంపెనీలు తెలిపాయి. మూడో దశలోతాము అనుకున్న ఫలితాలు వచ్చాయని అంటున్న శాస్త్రవేత్తలు… చికిత్స తరవాత కొత్తగా ఎలాంటి ఇబ్బందులు రాలేదని… తమ పరిశోధనలు ఇంకా కొనసాగుతాయని తెలిపారు. రెండోదశలో జరిగిన పరిశోధనల్లో క్యాన్సర్‌ ట్యూమర్లు మళ్ళీ రావడం, మరణం వంటివి 49 శాతం తగ్గినట్లు వెల్లడైంది. మూడోదశలో మంచి ఫలితాలు వచ్చినట్లు పేర్కొన్నారు. మెలనోమా, లంగ్స్‌, బ్లాడర్‌, కిడ్నీ, ప్యాంక్రియాటిస్‌, గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్లపై రెండో దశ, మూడో దశ ప్రయోగాలు జరుగుతున్నాయని కంపెనీలు తెలిపాయి.

Leave a Reply