For Money

Business News

”క్రూడ్‌ 380 డాలర్లకు చేరుతుంది”

ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యాపై అమెరికా, యూరోపియన్‌ దేశాలు విధిస్తున్న ఆర్థిక ఆంక్షల కారణంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు 380 డాలర్లకు చేరే అవకాశముందని జేపీ మోర్గాన్‌ ఛేజ్‌ అండ్ కంపెనీ హెచ్చరించింది. రష్యాపై పలు రకాల పెనాల్టీలు వేసేందుకు అమెరికా, యూరప్‌ దేశాలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఆర్థికంగా బలంగా ఉన్న రష్యా… క్రమంగా చమురు ఉత్పత్తి తగ్గించే ప్రమాదం ఉందని ఇదే జరిగితే క్రూడ్‌ ధర భారీగా పెరుగుతుందని ఈ సంస్థ వెల్లడించింది. ఇపుడు క్రూడ్‌ ఆయిల్‌పై రష్యాకు చెల్లిస్తున్న ధర మున్ముందు పెరగకుండా గ్రూప్‌ సెవన్‌ దేశాలు యత్నిస్తున్నాయి. దీనికి బదలు రష్యా గనుక క్రూడ్‌ ఉత్పత్తి తగ్గించి… సరఫరా తగ్గిస్తే క్రూడ్‌ ధరలు ఆకాశాన్నంటుతాయని జేపీ మోర్గాన్‌కు చెందిన అనలిస్టులు హెచ్చరించారు. తన క్లయింట్లకు పంపిన నోట్‌లో ఈ విషయాన్ని అనలిస్టలు ఈ హెచ్చరిక చేశారు. రష్యా గనుక రోజుకు 30 లక్షల బ్యారెల్స్‌ చొప్పున క్రూడ్‌ సరఫరా తగ్గిస్తే బ్యారెల్‌ చమురు ధర 190 డాలర్లకు చేరుతుందని, అదే 50లక్షల బ్యారెల్స్‌ చొప్పన తగ్గిస్తే క్రూడ్‌ ధర 380 డాలర్లకు చేరుతుందని పేర్కొన్నారు. అమెరికా, యూరప్‌ దేశాలతో రష్యా రాజీ పడకుండా చమురు సరఫరాను తగ్గించేందుకు మొగ్గు చూపే అవకాశముందని అనలిస్టులు హెచ్చరించారు. యూరప్‌, అమెరికాను ముప్పుతిప్పలు పెట్టేందుకు గ్లోబల్‌ ఆయిల్ మార్కెట్‌లను నియంత్రించే స్థాయికి రష్యా ప్రయత్నించవచ్చని పేర్కొంది.జేపీ మోర్గాన్‌ లెక్కన చూస్తే.. ఒకవేళ డాలర్‌ ఇదే స్థాయిలో ఉన్నా మన దేశంలో లీటర్‌ పెట్రోల్‌ ధర దాదాపు రూ. 400 చేరే అవకాశం ఉంటుందన్నమాట. ఇపుడు ముడి చమురు 110 డాలర్లు ఉండగా, మన దేశంలో పెట్రోల్‌ రూ. 110 వద్ద ఉంటోంది. ఇదే దామాషాలో పెరిగితే లీటర్‌ పెట్రోల్ రూ.380కు చేరుతుందన్నమాట. ఈలోగా డాలర్‌ పెరిగితే అంతే సంగతులు.