For Money

Business News

అదే గ్యాంగ్‌… అదే హవాలా… మారని తీరు

జగన్‌ అక్రమాస్తుల విచారణ అటకెక్కడంతో ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు చెలరేగిపోతున్నారు. నాడు నల్లధనాన్ని హవాలా మార్గంలో తరలించినవారు ఇపుడు రెట్టించిన ఉత్సాహంతో ఏకంగా క్యాష్‌ను తరలిస్తున్నారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో కోల్‌కతా కేంద్రంగా అనేక బోగస్‌ కంపెనీలను ఏర్పాటు చేసి.. తద్వారా జగన్‌ తన కంపెనీలకు నిధులు తరలించారని సీబీఐ, ఈడీలు తమ చార్జిషీటులో పేర్కొన్నాయి. ఆ సమయంలో డజనుకు పైగా సూట్‌ కేసు కంపెనీలు ఏర్పాటు చేసి… నల్లధనం రవాణానే తన ప్రధాన వ్యాపారంగా మల్చుకున్న వ్యక్తులు ఇపుడు చెలరేగిపోతున్నారు. ఇవాళ హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద దొరికిన రూ.2.5 కోట్ల క్యాష్‌ వెనుక ఈ పెద్దలే ఉండటం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్‌,జూబ్లిహిల్స్‌ పోలీసుల అదుపులో ఉన్న బొచ్చు రాము అనే వ్యక్తి బొయాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీలో మేనేజర్‌. ఈ కంపెనీ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది. ఈ కంపెనీని ఏర్పాటు చేసిన వ్యక్తుల్లో కీలక వ్యక్తి దినేష్‌ కుమార్‌ ఝున్‌ఝున్‌వాలా. జగన్‌ అక్రమాస్తులు కేసుల సమయంలో సీబీఐ ఇతనికి సంబంధించిన పూర్తి వివరాలను తన చార్జిషీటులో పేర్కొంది. ఇతను ఏర్పాటు చేసిన కోల్‌కతా సూట్‌ కేస్‌ కంపెనీలు ష్రైన్‌ ఫైనాన్స్‌, శతాబ్ది ఇన్వెస్ట్‌మెంట్స్‌ కంపెనీలు జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడి పెట్టాయి. ఈ కంపెనీల్లోకి నిధులు తరలించడానికి పలు కంపెనీలను ఇతను ఏర్పాటు చేసినట్లు సీబీఐ పేర్కొంది. ఇతను విదేశాల నుంచి కూడా నిధులను మనదేశానికి తరలించాడు. జూబ్లిహిల్స్‌ పోలీసుల పత్రికా ప్రకటన ప్రకారం చూస్తే… బొచ్చు రాముకు ఢిల్లీలోని పోలా సత్యనారాయణ మిత్రుడని తేలింది. అతని ఆదేశాలతోనే నిధులు తరలిస్తున్నట్లు చెప్పాడు. ఈ పోలా సత్యనారాయణ ఎవరో కాదు. దినేష్‌ కమార్‌ ఝున్‌ఝున్‌ మిత్రుడు. ఇది వరకు పేర్కొన్న ష్రైన్‌ ఫైనాన్స్‌, శతాబ్ది ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పోలా సత్యనారాయణ కూడా డైరెక్టర్‌. జగన్‌ కంపెనీల్లోకి నల్లధనాన్ని తరలించడానికి ఉపయోగించిన పలు కంపెనీల్లో ఇతను డైరెక్టర్‌. వీరిద్దరూ కలిసి నిధులు నిధులు తరలించడంతో సిద్ధహస్తులు. చిత్రమేమిటంటే.. జగన్‌ అక్రమాస్తులు కేసుల సమయంలో వీరు అనేక కంపెనీలు ఏర్పాటు చేసినా…సీబీఐ, ఈడీలు రంగంలోకి దిగడంతో సైలెంట్‌ అయిపోయారు. ఏపీలో జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి  వచ్చినప్పటి నుంచి  వీరు చెలరేగిపోతున్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తరవాత అంటే 2019 తరవాత దినేష్‌ కుమార్‌ ఝున్‌ఝున్‌వాలా… ఏరో రీటైల్‌ లాజిస్టిక్స్‌ (2019) ప్రీమియం పోర్ట్‌ లాంజ్‌ సర్వీసెస్‌ (2019) ధృవి లాజిస్టిక్స్‌ (2019) ప్రివెట్‌ ఇంజినీరింగ్‌ (2020) ధృవి ఇన్‌ఫ్రాబిల్డ్‌ (2020) ఏరోనాట్స్‌ లాయల్టి (2021) ఏరోనాట్స్‌ రివార్డ్స్‌ (2021) యూనిక్‌ హాస్పిటాలిటి (2021) కంపెనీలను ఏర్పాటు చేశాడు. దినేష్‌ గత చరిత్ర మొత్తం హవాలా, సూట్‌ కేస్‌ కంపెనీలే. మరి ఈ కంపెనీల ద్వారా దినేష్‌ ఝున్‌ఝున్‌వాలా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో మరి?

విచారణ కోసం …
జగన్‌ అక్రమాస్తులు కేసులో కీలక పాత్ర ధారులు ఇలా మళ్ళీ హవాలాకు పాల్పడినట్లు తేలడంతో… ఈ కేసు విచారణను వేగవంతం చేయాల్సిందిగా పిటీషన్లు దాఖలు చేసే అవకాశముంది. ఈ కేసుకు సంబంధించి పలు అంశాల్లో కోర్టును ఆశ్రయించారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. తాజా ఘటనలతో ఆయన మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తారేమో చూడాలి.