For Money

Business News

టీఆర్‌ఎస్‌ టార్గెట్‌: ఫినిక్స్‌పై ఐటీ దాడులు

ఉదయం నుంచి ఇతర ఛానల్‌ కూడా పెద్దగా పట్టించుకోకున్నా… నంబర్‌ వన్‌ ఛానల్‌ ఎన్‌టీవీ మాత్రం ఫినిక్స్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ కంపెనీపై జరుగుతున్న ఐటీ దాడులపై నాన్‌ స్టాప్‌ కవరేజీ ఇస్తోంది. చాలా మంది రాజకీయ ప్రముఖులు ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టారంటూ ప్రచారం మొదలు పెట్టింది. దీంతో ఇపుడు తెలుగు రాష్ట్రాలల్లో ఫినీక్స్‌పై ఐటీ దాడులు హాట్‌ టాపిక్‌గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల్లో ఒకటైన ఫీనిక్స్‌ హైదరాబాద్‌లో ముఖ్యంగా సైబరాబాద్‌ అనేక భారీ ప్రాజెక్టులను చేపట్టింది. ఈ కంపెనీతో సంబంధం ఉన్నవారు అధికార టీఆర్‌ఎస్‌కు సన్నిహితులని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అనేక చోట్ల ప్రభుత్వ భూముల్లో వీరు ప్రాజెక్టులు చేపట్టారని ఉదయం నుంచి సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఏకంగా పాతిక మంది అధికారులు కంపెనీ ఛైర్మన్‌, డైరెక్టర్లపై దాడి చేయడం వెనుక ఢిల్లీ పెద్దల హస్తం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్రంపై సీఎం కేసీఆర్‌ దాడి పెంచిన తరవాత తెలంగాణ రాష్ట్రంలో చిత్రం మారుతోంది. మొన్నటి దాకా చిన్న చిన్న కంపెనీలపై ఐటీ దాడులు జరగ్గా.. ఇపుడు పెద్ద చేపలపై దృష్టి పెడుతున్నారు అధికారులు. మైహోం గ్రూప్‌, మెగా గ్రూప్‌ తరవాత ఓ భారీ పారిశ్రామిక గ్రూప్‌పై దాడులు జరగడం ఇదే మొదటిసారి. దాడుల వివరాలు ఎవరికీ తెలియవు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారని… అనధికారిక లావాదేవీలను గుర్తించారని ఎవరికి వారు రాసుకోవడం వినా… ఐటీ విభాగం నుంచి ఎలాంటి సమాచారం లేదు. దాడులకు సంబంధించి ఐటీ విభాగం ఇచ్చే లీక్‌ల కోసం మీడియా ఎదురు చూస్తోంది.