For Money

Business News

భారత్‌లో ఆయిల్‌ సంక్షోభం?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంగాతో భారత ఆర్థిక వ్యవస్థ అనూహ్యంగా డేంజర్‌ జోన్‌లోకి వచ్చేసింది. బడ్జెట్‌ సమయంలో తయారు చేసిన చాలా వరకు అంచనాలు ఆయిల్‌ ధరలు సగటున 70 డాలర్ల నుంచి 75 డాలర్ల మధ్య ఉంటుందని అంచనా వేశారు. ఇపుడు స్పాట్‌ సంగతి దేవుడు ఎరుగు? మేలో డెలివరీ తీసుకునే ఫ్యూచర్స్‌ కాంట్రాక్ట్‌ ఇవాళ 130.89 డాలర్లకు చేరింది. అణు ఆంక్షలు ఎత్తివేతపై ఇరాన్‌ చర్చల్లో ప్రతిష్ఠంభన కారణంగా ఆయిల్ సరఫరా మెరుగుపడలేదు. అమెరికా ప్రతిపాదించినట్లు యూరోపియన్‌ యూనియన్‌ రష్యా ఆయిల్‌ను నిషేధిస్తే ఆయిల్ రంగంలో పెను సంచనాలు ఏర్పడుతాయి. ఎందుకంటే చాలా వరకు యూరప్‌ దేశాలు రష్యా నుంచి ఆయిల్‌ దిగుమతి చేసుకుంటాయి. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా హెచ్చరించినట్లు 200 డాలర్లు కాకాపోయినా.. 150 డారల్లకు చేరినా… భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలన్నీ తలకిందులు అవుతాయి. ఎందుకంటే కరెన్సీ మార్కెట్‌లో చమురుకు పోటీగా డాలర్‌ కూడా పెరుగుతోంది. ఇవాళ డాలర్‌ ఇండెక్స్‌ 99ను దాటింది. ఒకవైపు డాలర్‌, మరోవైపు క్రూడ్‌ ధరలు పెరగడమంటే రెండు వైపులా భారత్‌పై భారం పెరగడమే. ఆయిల్‌ దిగుమతులు 85 శాతం దాకా ఉన్నందున భారీ ఎత్తున డాలర్లు పెట్టి కొనాల్సి వస్తోంది.
రష్యాపై వేటుపడితే?
మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత రష్యా నుంచి భారత్‌ ఆయిల్ దిగుమతులు పెంచింది. అలాగే ఎస్సార్‌ ఆయిల్‌ను రష్యా ప్రభుత్వ సంస్థ రాస్‌నాఫ్ట్‌, ఇతర ఇన్వెస్టర్లకు అమ్మేసింది. అంటే ఇప్పటి వరకు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుని ఎస్సార్‌ ఆయిల్ మనదేశంలో అమ్ముతోంది. ఇపుడు రష్యా ఆయిల్‌పై ఆంక్షలు విధిస్తే… ఎస్సార్‌ అయిల్‌ కూడా బహిరంగ మార్కెట్‌లో కొని ఇండియాలో అమ్మాలి. లేదా పెట్రోల్‌ పంపులు మూసివేయాలి? రష్యాపై ఇతర ఆంక్షలు కూడా ఉన్నందున ఎస్సార్‌ ఆయిల్‌ పంపుల వ్యవహారం సస్పెన్స్‌గా మారనుంది. మరోవైపు రష్యా నుంచి భారత ఆయిల్ కంపెనీలకు సరఫరా అయ్యే చమురు కూడా ఆగిపోతుంది. మరి దానికి ప్రత్యామ్నాయంగా అధిక రేటుతో బహిరంగ మార్కెట్‌లో కొనాల్సి ఉంటుంది. రష్యా ఆయిల్‌పై విధించే అంక్షల్లో గవర్నమెంట్‌ టు గవర్నమెంట్‌ ఒప్పందాలను మినహాయిస్తే సరి. లేకుంటే భారత్‌ ఆయిల్‌ సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఏర్పడుతోంది. ఇప్పటికే బొగ్గు, స్టీల్‌తో పాటు అనేక ఖనిజాల దిగుమతి భారమైంది. ఇక వంటనూనెలు సరేసరి. మొత్తానికి రష్యా, ఉక్రెయిన్‌ వివాదం భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలు తలికిందులౌతోంది.

ఆయిల్‌ మార్కెట్‌కు రష్యా ఆయిల్‌ కీలకం. ఎందుకంటే ప్రపంచంలో అత్యధికంగా చమురు ఉత్పత్తి దేశాల్లో రష్యా మూడో స్థానంలో ఉంది.