For Money

Business News

ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్‌ అదుర్స్‌

గత ఏడాదితో పోల్చితే హైదరాబాద్‌లో మే నెల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు 152 శాతం ఎగబాకాయి. మే నెలలో 6,301గా నమోదైనట్టు ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది. ఇదే ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే 17.6 శాతం పెరిగిందని తెలిపింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఈ స్థాయిలో రాణించడం గొప్ప విషయమని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా పేర్కొన్నది. ఇక మే నెలలో జరిగిన లావాదేవీల మొత్తం విలువ రూ.3,058 కోట్లుగా కాగా, గత ఏడాదితో చూస్తే ఇది 146 శాతం అధికమని తెలిపింది. ఈ ఏడాది జనవరి మొదలు మే ఆఖరుదాకా హైదరాబాద్‌ రెసిడెన్షియల్‌ మార్కెట్‌లో రిజిస్టరైన ప్రాపర్టీల మొత్తం విలువ రూ.15,071 కోట్లుని నైట్‌ ఫ్రాంక్‌ స్పష్టం చేసింది. హైదరాబాద్‌తోపాటు, మేడ్చల్‌-మల్క్‌జ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలను కలిపి హైదరాబాద్‌ రెసిడెన్షియల్‌ మార్కెట్‌గా పరిగణించి తాజా గణాంకాలను తయారు చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇళ్ళ ధరల ఆధారంగా చూస్తే రూ.25 లక్షలు-50 లక్షల రేంజ్‌లో ఉన్న ఇళ్ళకు అధిక ఆదరణ ఉంది. సగంపైగా అంటే 55 శాతం అమ్మకాలు ఈ కేటగిరి నుంచే ఉన్నాయని నైట్‌ఫ్రాంక్‌ తెలిపింది. రూ.25 లక్షలలోపు ఇండ్లకు డిమాండ్‌ 18 శాతానికి పడిపోయినట్టు ఈ సందర్భంగా నైట్‌ ఫ్రాంక్‌ తెలియజేసింది.