For Money

Business News

రష్యా ఆయిల్‌పై 40 డాలర్ల దాకా డిస్కౌంట్‌!

గత ఏడాది మే నెలలో రష్యా నుంచి మన దేశానికి దిగుమతి అయిన క్రూడ్‌ ఆయిల్‌ రోజుకు 1,36,774 బ్యారల్స్‌.
ఈ ఏడాది ఏప్రిల్‌లో రోజుకు 3,88,666 బ్యారల్స్‌.
మేలో దిగుమతి అయింది.. రోజుకు 8,40,645 బ్యారెల్స్‌
జూన్‌లో రోజుకు పది లక్షలకు పైగా బ్యారెల్స్‌ క్రూడ్‌ దిగుమతి అయ్యే అవకాశముందని కమాడిటి అనలిస్ట్‌ కప్లెర్ (Kpler) పేర్కొంది.
గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా దిగుమతి అవుతున్న ఈ ఆయిల్‌ ధర ఎంతో తెలుసా? మార్కెట్‌ ధరపై ఒక్కో బ్యారెల్‌పై 40 డాలర్ల దాకా డిస్కౌంట్‌ ఇస్తోంది రష్యా. అంటే బయట మార్కెట్‌లో వంద డాలర్లు ఉంటే.. మనకు 60 డాలర్లకే వస్తోందన్నమాట. మరి ఇంత చవకగా క్రూడ్‌ లభిస్తుండగా… ప్రభుత్వం నామమాత్రంగా ధరలు తగ్గించి.. రాష్ట్రాలపై ఎందుకు ఒత్తిడి తెస్తోంది. మరోవైపు రష్యా నుంచి ప్రభుత్వ కంపెనీలు దిగుమి చేసుకున్న క్రూడ్‌ రిఫైన్‌ చేసి మన మార్కెట్‌లో అమ్ముతారు. మరి ప్రైవేట్‌ కంపెనీలైన రిలయన్స్‌, నయారా ఎనర్జి (పాత పేరు ఎస్సార్‌ ఆయిల్‌) దిగుమతి చేసుకున్న ఆయిల్‌ను ఏం చేస్తున్నాయి. దేశీయ మార్కెట్‌లో ప్రభుత్వ ధరకు అమ్మితే తమకు నష్టం వస్తుందని చెప్పిన ఈ కంపెనీలు… ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్న విషయం బయటపడింది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఆయిల్‌ మన దేశ రిఫైనరీలో రిఫైన్‌ చేసి విదేశాలకు అమ్ముతున్నారని రాయిటర్స్‌ కథనంలో బయటపడింది. రిలయన్స్‌కు జామ్‌ నగర్‌లో రోజుకు 12 లక్షల బ్యారెళ్ళ క్రూడ్‌ను రిఫైన్‌ చేసే రిఫైనరీ ఉంది. మే నెలలో రష్యా నుంచి 108 లక్షల బ్యారెళ్ళ క్రూడ్‌ను దిగుమతి చేసుకుంది రిలయన్స్‌ రిఫైనరీ. ఇందులో ఒక్క ఆస్ట్రేలియాకే 20 లక్షల బ్యారెళ్ళ డీజిల్‌ను రిలయన్స్‌ ఎగుమతి చేసినట్లు రాయిటర్స్‌ పేర్కొంది. మే నెలలోనే 25.6 లక్షల బ్యారెళ్ళ డీజిల్‌ను యూరప్‌ దేశాలకు రిలయన్స్‌ ఎగుమతి చేసింది. మరో 8.9 లక్షల బ్యారెళ్ళ గ్యాసోలిన్‌ను అమెరికాకు ఎగుమతి చేసింది. అంటే 60 శాతంపైగా ఈ మూడు దేశాలకే రిలయన్స్‌ ఎగుమతి చేసింది. రష్యా ప్రభుత్వ కంపనీకి అనుబంధ సంస్థ అయిన నయారా ఎనర్జి కూడా చౌకగా రష్యా నుంచి క్రూడ్‌ దిగుమతి చేసుకుని ఆస్ట్రేలియాకు డీజిల్‌ను ఎగుమతి చేస్తోంది. రష్యా నుంచి ఆయిల్‌ దిగుమతులపై నిషేధం అని పైకి చెప్పి.. పరోక్షంగా భారత్‌ నుంచి డీజిల్‌ను ఈ దేశాలు తెప్పించుకుంటున్నాయన్నమాట. ఇందులో ప్రైవేట్ కంపెనీలు భారీగా లాభాలు పొందుతున్నాయి. మరో దేశం నుంచి రష్యా ఉత్పత్తులను రిఫైన్‌ చేసి ఎగుమతి చేయడంపై కూడా నిషేధం విధించే అవకాశం ఉందని వార్తలు రావడంతో ఈ వ్యవహారం మొత్తం బయటపడింది.
ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించడానికి ముందు రూ. 2300 ప్రాంతంలో ఉన్న షేర్‌ రూ. 2800 దాకా పెరిగి తరవాత రూ.2300 ప్రాంతానికి పడింది. అయితే ఇటీవల రష్యా ఆయిల్‌ వల్ల రియలన్స్‌ రిఫైనింగ్‌ మార్జిన్స్‌ ఎలా పెరుగుతాయో వివరిస్తూ వార్తలు వచ్చాయి. దీంతో ఈ షేర్‌ మళ్ళీ పెరిగి రూ. 2700 దాటింది.