For Money

Business News

ఈ కంపెనీ రూ.25,100 కోట్లకు టోపీ

బ్యాంకుల రుణాల ఎగవేత కేసుల్లో మొన్ననే ఏబీజీ షిప్‌యార్డ్‌ రికార్డు సృష్టించింది. ఏకంగా రూ. 22000 కోట్ల రుణాలను ఎగ్గొట్టి… నంబర్‌ వన్‌ స్థానంలోకి వచ్చింది. కాని వారిని కాపాడేందుకా అన్నట్లు ఇపుడు మరో కంపెనీ భారీ మొత్తాన్ని డిఫాల్ట్‌ చేసింది. ఆటో రంగంలో పేరొందిన ఆమ్‌టెక్‌ ఆటో గ్రూప్‌ కంపెనీలు రూ. 25,100 కోట్ల రుణాలను ఎగ్గొట్టి… నవంబర్‌ వన్‌ డీఫాల్టర్‌గా మారారు. ఆమ్‌టెక్‌ ఆటో ఒక్కటే రూ. 12600 కోట్ల రుణాలకు డీఫాల్ట్‌ అవగా, అదే గ్రూప్‌నకు చెందిన కాస్టెక్స్‌ టెక్నాలజీ, మెటలిస్ట్‌ ఫోర్జింగ్‌, ఆమెటెక్‌ రింగ్‌ గేర్‌ కంపెనీలు కలిసి రూ. 12500 కోట్ల రుణాలు చెల్లించలేక డీఫాల్ట్‌ అయినట్లు సీఎన్‌బీసీ టీవీ 18 పేర్కొంది. ఆమ్‌టెక్‌ ఆటో గ్రూప్‌ ఖాతాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేసిన ఎర్నెస్ట్ అండ్‌ యంగ్‌ కంపెనీ నివేదికను చూసి ఆ ఛానల్ ఈ కథనాన్ని ప్రసారం చేసింది. బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు పొందిన కంపెనీ ప్రమోటర్లు, కంపెనీ అధికారులు భారీ మొత్తాన్ని షెల్‌ కంపెనీలకు, సొంత కంపెనీలకు తరలించినట్లు ఈ ఫోరెన్సిక్‌ నివేదికలో వెల్లడైంది. కంపెనీ నుంచి నిధులు పొందిన వారి ఈ మెయిల్‌ ఐడీలు, అడ్రస్‌లు, డైరెక్టర్లు… అందరూ ఆమ్‌టెక్‌ ఆటోకు సంబంధించిన వారేనని తేలింది. తీసుకున్న రుణాలపై గ్రూప్‌ కంపెనీలు కనీసం వడ్డీ కూడా కట్టలేదని తెలుస్తోంది. భారీ మొత్తంలో రుణాలు తీసుకున్న కంపెనీలు.. ఆ మేరకు ఎలాంటి కొనుగోళ్ళు, అమ్మకాలు చేయకుండా దొంగ లావాదేవీలతో నిధులు తరలించినట్లు బయటపడింది.