For Money

Business News

టికెట్‌ రద్దు చేసుకున్నా జీఎస్టీ కట్టాల్సిందే…

మీరు ప్రయాణం క్యాన్సిల్‌ చేసుకున్నారు. మీరు వెళ్ళడం లేదు. అయినా మీరు అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకున్న టికెట్‌పై జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. రైలు టికెట్లు క్యాన్సిల్‌ చేసుకొన్నా జీఎస్టీ కట్టాల్సిందేనని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒక్క రైలు టికెట్‌ రద్దు చేసుకోవటమే కాదు.. విమాన టికెట్‌, హోటల్‌ టికెట్‌… ఏది అడ్వాన్స్‌గా బుక్‌ చేసుకుని రద్దు చేసుకొన్నా జీఎస్టీ కట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నెల 2న కేంద్ర ఆర్థిక శాఖ ట్యాక్స్‌ రిసెర్చ్‌ యూనిట్‌ ఒక సర్క్యూలర్‌ కూడా జారీ చేసింది. టికెట్‌ రద్దు చేసుకొంటే జీఎస్టీ ఎందుకు కట్టాలనే వివరణ కూడా కేంద్రం ఇచ్చింది. ‘టికెట్‌ బుక్‌ చేసుకోవటం అంటే కాంట్రాక్టు తీసుకొన్నట్టే. అదే టికెట్‌ను రద్దు చేయటం అంటే ఒప్పందం చేసుకొన్న కాంట్రాక్టును ఉల్లంఘించినట్టే. కాబట్టి జీఎస్టీ కట్టి తీరాలి’.. ఇదీ కేంద్రం ఇచ్చిన వివరణ. టికెట్‌ ఎందుకు క్యాన్సిల్‌ చేస్తున్నావో సంబంధం లేకుండా 5 శాతం జీఎస్టీ కట్టాల్సిందేనని తేల్చి చెప్పింది. టికెట్‌ రద్దు చేసుకొన్నా జీఎస్టీ విధిస్తూ కేంద్రం జారీ చేసిన సర్క్యులర్‌పై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సేవలు పొందితే జీఎస్టీ వసూలు చేయొచ్చు కాని… సేవలు వద్దన్నా పన్ను విధించటం దారుణమని వినియోగదారులు మండిపడుతున్నారు.